దంచికొట్టిన రోస్టన్‌, జోన్స్‌.. కింగ్స్‌దే సీపీఎల్‌ టైటిల్‌ | CPL 2024: Aaron Jones Roston Chase Lead Saint Lucia Kings To Maiden Title | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన రోస్టన్‌, జోన్స్‌.. కింగ్స్‌దే సీపీఎల్‌ టైటిల్‌

Published Mon, Oct 7 2024 1:15 PM | Last Updated on Mon, Oct 7 2024 1:44 PM

CPL 2024: Aaron Jones Roston Chase Lead Saint Lucia Kings To Maiden Title

PC: SLK X

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)-2024 చాంపియన్‌గా సెయింట్‌ లూసియా కింగ్స్‌ జట్టు అవతరించింది. గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లు
గయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్‌ లూసియా కింగ్స్‌- గయానా అమెజాన్‌ వారియర్స్‌ మధ్య సీపీఎల్‌ టైటిల్‌ పోరు జరిగింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

దెబ్బ కొట్టిన నూర్‌ అహ్మద్‌
వారియర్స్‌ బ్యాటర్లలో టెయిలెండర్‌ ప్రిటోరియస్‌ 25 పరుగులతో టాప్‌ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ షాయీ హోప్‌ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్‌ బౌలర్లలో స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.

ఓపెనర్‌ మొయిన్‌ అలీ(14), హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్‌ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్‌, అల్జారీ జోసెఫ్‌, రోస్టన్‌ ఛేజ్‌, డేవిడ్‌ వీస్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

దంచికొట్టిన రోస్టన్‌, జోన్స్‌
ఇక వారియర్స్‌ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్‌ లూసియా కింఘ్స్‌ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్‌ విఫలమైనా మిడిలార్డర్‌ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది.  ఓపెనర్లలో కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్‌ చార్ల్స్‌(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ టిమ్‌ సిఫార్ట్‌ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.

ఇలాంటి దశలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్‌ జోన్స్‌ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్‌ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. 

PC: SLK X
విజేతల జాబితా ఇదే
కాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్‌. ఇక 2013లో వెస్టిండీస్‌ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్‌ అరంగేట్ర విజేతగా నిలిచింది. 

తర్వాత వరుసగా బార్బడోస్‌ ట్రిడెంట్స్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో రెడ్‌స్టీల్‌, జమైకా తలైవాస్‌, ట్రింబాగో నైట్‌ రైడర్స్‌, ట్రింబాగో నైట్‌ రైడర్స్‌, బార్బడోస్‌ ట్రిడెంట్స్‌, ట్రింబాగో నైట్‌ రైడర్స్‌, సెయింట​ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌, జమైకా తలైవాస్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌.. తాజాగా సెయింట్‌ లూసియా కింగ్స్‌ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.

చదవండి: నేను అలా బౌలింగ్‌ చేయడానికి కారణం వారే: మయాంక్‌ యాదవ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement