
PC: IPL Twitter
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సీఎస్‌కే సారధి మహేంద్ర సింగ్ ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. మహేంద్రుడు ఇప్పటివరకు 21 ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు బాదాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమం. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు చిన్న తలా సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా.. 24 ఇన్నింగ్స్‌ల్లో 714 పరుగులు చేశాడు. రైనా, ధోని తర్వాత షేన్ వాట్సన్ (12 ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు), మైక్ హస్సీ (11 ఇన్నింగ్స్‌ల్లో 388 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (14 ఇన్నింగ్స్‌ల్లో 373 పరుగులు) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్-5 ఆటగాళ్లంతా సీఎస్‌కే సభ్యులే కావడం విశేషం.
ప్లే ఆఫ్స్‌లో ధోని గణాంకాలు చూసి, నేటి (మే 23, క్వాలిఫయర్-1) మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రత్యర్ధి అయిన గుజరాత్‌కు వణుకుపుడుతుంటుంది. అసలే మహేంద్రుడు గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో ధాటిగా ఆడుతున్నాడు. దానికి తోడు అతని ప్లే ఆఫ్స్ గణాంకాలు మరింత బయపెట్టేవిగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ధోని అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది. ధోనిని కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలింగ్ విభాగం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మ్యాచ్ ధోని వరకు వచ్చిందో అతన్ని ఆపడం కష్టమేనని అభిమానులు భావిస్తున్నారు. ఛేదనలో అయినా.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పాత ధోనిని చూడటం ఖాయమని అతని అభిమానులు పందెలు కాస్తున్నారు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ధోని భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అతను ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 190.74 స్ట్రయిక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు. సీఎస్‌కే టాపార్డర్ ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో ధోనికి సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన దాంట్లో మహేంద్రుడు తనదైన స్టయిల్‌లో బ్యాట్‌ను ఝులిపించాడు.
ఇదిలా ఉంటే, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్, సీఎస్‌కే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా తదుపరి వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. లక్నో-ముంబై జట్ల మధ్య రేపు (మే 24) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఇవాళ ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో (మే 26) తలపడే అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్‌లో విజేత.. ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజేతతో ఫైనల్స్‌లో (మే 28) తలపడుతుంది.
చదవండి: కోహ్లి ఒక్కడితోనే వేగలేకుంటే మరొకరు తయారయ్యారు.. ప్రపంచ దేశాల్లో వణుకు..!
Comments
Please login to add a commentAdd a comment