న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించాడు. అచ్చం విండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌ను పోలిన ఈ వ్యక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటారని తెలుసు కానీ, మరీ ఇంతటి దగ్గరి పోలికలా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఒక్క సైజ్ తప్పించి స్టాండ్స్‌లో తారసపడ్డ వ్యక్తి అన్ని కోణాల్లో సునీల్ నరైన్ కార్బన్ కాపీలా ఉన్నాడు.
అతని హెయిర్ స్టైల్, మీసకట్టు, గడ్డం, చెవికి పోగు, మెడపై టాటూ.. ఇలా ఏ యాంగిల్‌లో చూసినా సదరు వ్యక్తి సునీల్ నరైన్‌కు డిట్టో టు డిట్టోలా ఉన్నాడు. ఆ వ్యక్తి సునీల్ నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు కేకేఆర్ జెర్సీ ధరించి ఉండటం మరో విశేషం. అచ్చుగుద్దినట్లు సునీల్ నరైన్‌లా ఉన్న ఈ వ్యక్తి ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలియలేదు. మొత్తానికి సునీల్ నరైన్ డూప్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాడు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్.. మలాన్‌ను నబీ ఔట్ చేశారు. 12.4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 68/3గా ఉంది. హ్యారీ బ్రూక్ (12), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment