
లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు ఏం చేశారో మనందరం చూశాం. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. మొహమ్మద్ షమీ (7-2-22-4), జస్ప్రీత్ బుమ్రాలు (6.5-1-32-3) తూటాలాంటి బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై మెరుపుదాడి చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. షమీ, బుమ్రాలు పోటీపడి వికెట్లు సాధించడంతో టీమిండియా తక్కువ స్కోర్‌కు (229) డిఫెండ్ చేసుకోవడమే కాకుండా 100 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
అవకాశాలు రాకపోయిన నిరాశపడలేదు..
తుది జట్టు కూర్పులో సమస్యల కారణంగా వరల్డ్‌కప్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశాలు రాని షమీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో షమీ ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా ఏకంగా 9 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 5 వికెట్లు పడగొట్టిన లాలా (షమీ ముద్దు పేరు).. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 4 వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.
నిన్నటి ప్రదర్శనతో షమీ వరల్డ్‌కప్‌లోనే అత్యంత వేగంగా 40 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. షమీ కేవలం 13 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇందులో 6 సార్లు 4 వికెట్ల ఘనత (2 ఐదు వికెట్ల ఘనతలతో పాటు) సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో షమీ, స్టార్క్ మాత్రమే ఇన్ని సార్లు నాలుగు వికెట్ల ఘనతలు సాధించగలిగారు.
ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమ గణాంకాలు 5/54గా (ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై) ఉన్నాయి. అలాగే నిన్నటి ప్రదర్శనతో షమీ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు), జవగల్ శ్రీనాథ్ (33 మ్యాచ్‌ల్లో 44) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.