
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యంకాని ఓ ఆసక్తికరమైన రికార్డును నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెలకొల్పాడు. హిట్‌మ్యాన్ నిన్నటి మ్యాచ్‌లో సాధించిన రికార్డుల్లో ఇది ఒకింత ప్రత్యేకమైంది. రోహిత్ సాధించిన ఈ రికార్డు 52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేదు.
ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు సాధించిన తొలి ఆటగాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ క్రికెటర్‌కు ఇది సాధ్యపడలేదు. కొందరు ఆటగాళ్లు 100 బౌండరీలు కొడితే, సిక్సర్ల విషయంలో వెనుకపడే వారు.. మరికొందరు 50 సిక్సర్లు బాదితే, బౌండరీల విషయంలో వెనుకపడే వారు. ఈ రికార్డు గురించి ఓ క్రికెట్ నిపుణుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే, నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి టీమిండియాకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందించిన విషయం తెలిసిందే. 230 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బుమ్రా (6.5-1-32-3), షమీ (7-2-22-4), కుల్దీప్ యాదవ్ (8-0-24-2), రవీంద్ర జడేజా (7-1-16-1) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను 100 పరుగుల తేడాతో గెలిపించారు. కఠినమైన పిచ్‌పై 87 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.