వన్డేల్లో విరాట్ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్‌కు బంతినందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని విరాట్.. తన స్పెల్ రెండో ఓవర్‌లో వికెట్ తీసి అదరగొట్టాడు. విరాట్ పడగొట్టన వికెట్ సాదాసీదా వికెట్ కాదు. అతను ఏకంగా ప్రత్యర్ధి కెప్టెన్ స్టాట్ ఎడ్వర్డ్స్‌కే (17) ఝలక్ ఇచ్చాడు.
వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ లెగ్‌సైడ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విరాట్‌కు చాలాకాలం తర్వాత వికెట్ దక్కింది. వికెట్ తీసిన అనంతరం విరాట్ సంబురాలు ఆకాశాన్ని అంటాయి. అతను సెంచరీ చేసినప్పుడు కూడా ఇంతలా సంతోషపడి ఉండడు. విరాట్ సాధించిన ఈ ఘనతను చూసి స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఉబ్బితబ్బి బైపోయింది. ఆమె సంతోషానికి కూడా అవథుల్లేకుండా పోయాయి.
వాస్తవానికి విరాట్‌కు అంతకుముందు ఓవర్లోనే వికెట్ దక్కాల్సి ఉండింది. అయితే స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. మొత్తంగా విరాట్ సాధించిన ఈ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. వన్డేల్లో విరాట్‌కు ఇది ఐదో వికెట్. అతను తన వన్డే కెరీర్‌లో అలిస్టర్ కుక్, కీస్వెట్టర్, డికాక్, మెక్‌కల్లమ్, స్కాట్ ఎడ్వర్డ్స్‌ల వికెట్లు పడగొట్టాడు. విరాట్ టీ20ల్లో (4), ఐపీఎల్‌లోనూ (4) వికెట్లు పడగొట్టాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో 411 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ ఓటమి దిశగా సాగుతుంది. ఆ జట్టు 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విరాట్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment