వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో రాణించి పసికూనపై పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో 410 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్‌లో టీమ్‌గా రాణించి ప్రత్యర్ధిని 250 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసి, లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది.
మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కితాబునిచ్చాడు. ప్రస్తుత టోర్నీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. భారత్ పటిష్టమైన జట్టు అనడానికి, వారు సాధిస్తున్న విజయాలే నిదర్శనమని తెలిపాడు. భారత బ్యాటింగ్ విభాగాన్ని ఆకాశానికెత్తాడు. సొగసైన బ్యాటింగ్ లైనప్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్లు ఎదురుదాడికి దిగి, మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసారని అన్నాడు.
ఈ టోర్నీ చాలా కఠినంగా ఉండబోతుందని ముందే తెలుసు. శక్తివంచన లేకుండా ఆడాం. రెండు అద్భుత విజయాలు సాధించాం. పలు మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలు కల్పించుకున్నాం. మరిన్ని విజయాలు సాధించాల్సి ఉండింది. ఓవరాల్‌గా మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నారు. ఈ టోర్నీ మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. చాలా నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టుగా ఎదగడానికి ఈ టోర్నీ చాలా సాయపడింది. టీ20 వరల్డ్‌కప్ 2024లోపు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్.. పటిష్టమైన సౌతాఫ్రికాను, తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment