ఓడినా వారు తోపులే.. ఆఫ్ఘన్‌ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన కివీస్‌ కెప్టెన్‌ | CWC 2023: New Zealand Captain Tom Latham Comments After Winning Against Afghanistan | Sakshi
Sakshi News home page

CWC 2023: ఓడినా తోపులే.. ఆఫ్ఘన్‌ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన కివీస్‌ కెప్టెన్‌

Published Thu, Oct 19 2023 7:42 AM | Last Updated on Thu, Oct 19 2023 9:12 AM

CWC 2023: New Zealand Captain Tom Latham Comments After Winning Against Afghanistan - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్‌ 18) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 149 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. అయితే ఓ దశలో ఆఫ్ఘన్‌ బౌలర్లు కివీస్‌ను వణికించారు.

కేవలం పరుగు వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (68), గ్లెన్‌ ఫిలిప్స్‌ (71) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీలతో ఆదుకోవడంతో కివీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. లాథమ్‌, ఫిలిప్స్‌తో పాటు విల్‌ యంగ్‌ (54) కూడా రాణించడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలో 2 వికెట్లు.. ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. లోకీ ఫెర్గూసన్‌ (7-1-19-3), మిచెల్‌ సాంట్నర్‌ (7.4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (7-1-18-2), మ్యాట్‌ హెన్రీ (5-2-16-1), రచిన్‌ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మాత్‌ షా (36), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ మాట్లాడుతూ.. మెగా టోర్నీలో మరో మంచి ఆరంభం లభించింది. మా ఆటగాళ్లు మరో అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్‌లో మేము ఓ దశలో ఒత్తిడికి లోనయ్యాం. అయితే ఓ కీలక భాగస్వామ్యం (లాథమ్‌-ఫిలిప్స్‌) తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చింది. ఒత్తిడిలో ఫిలిప్స్‌ అద్బుతంగా ఆడాడు.

ఇక్కడ ఆఫ్ఘన్‌ బౌలర్ల నైపుణ్యాన్ని పొగడకుండా ఉండలేము. వారు ప్రపంచంలోని ఎంతటి బ్యాటింగ్‌ లైనప్‌నైనా ఒత్తిడిలోకి నెట్టగలరు. ముఖ్యంగా ఆఫ్ఘన్‌ స్పిన్నర్లు ప్రత్యర్ధి నుంచి ఒక్కసారిగా మ్యాచ్‌ను లాగేసుకోగలరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వారేం చేశారో చూశాం. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఓడినా, వారి బౌలర్లు తోపులే.

మా బౌలర్ల విషయానికొస్తే.. అందరూ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అవసరమైన సమయంలో వికెట్లు తీయగలిగారు. మిచ్ సాంట్నర్ మరోసారి తన పని తాను చేసుకుపోయాడు. మొత్తానికి హర్షించదగ్గ ప్రదర్శన. తుదుపరి భారత్‌, ఆస్ట్రేలియాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నామని అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement