వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 149 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ఫలితంగా వారు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. మరోపక్క న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసికట్టుగా మరో అద్భుత ప్రదర్శన చేసి, టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (54), కెప్టెన్ టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు.. ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్.. లోకీ ఫెర్గూసన్ (7-1-19-3), మిచెల్ సాంట్నర్ (7.4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (7-1-18-2), మ్యాట్ హెన్రీ (5-2-16-1), రచిన్ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మాత్ షా (36), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
కివీస్ చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీది స్పందిస్తూ.. ముందుగా కివీస్‌కు శుభాకాంక్షలు. ఈ మ్యాచ్‌లో వారు చాలా బాగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మేము మాత్రం మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. మా ఫీల్డింగ్ చాలా చండాలంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఫీల్డింగ్‌తో రాణించడం చాలా కష్టం. మా ఆటగాళ్లు వదిలేసిన క్యాచ్‌లే మా కొంపముంచాయి. ఆ కారణంగానే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది.
ఆఖరి 6 ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఒకవేళ ఆ క్యాచ్‌లు పట్టినట్లయితే ప్రత్యర్ధి ఇంత స్కోర్ చేసేది కాదు. టామ్, ఫిలిప్స్‌ను మేము నిలువరించలేకపోయాం. పిచ్ చాలా స్లోగా ఉండింది. మేము బాగా బౌలింగ్ చేసాము కానీ, ఫీల్డింగ్ మా కొంపముంచింది. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో మా లోపాలను అధిగమించి విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment