శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్‌లలోనూ చెరో వికెట్ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డికాక్, డస్సెన్, మార్క్రమ్ పతిరణకు బౌలింగ్‌లో పరుగుల వరద పారిస్తే... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ అతని బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు.
ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్ యాక్షన్ ద్వారా జూనియర్ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్‌ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు.
యువ బౌలర్....
ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్‌లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్‌లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113)లు తమ సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment