రెచ్చగొట్టి మరీ సిక్స్‌ కొట్టించాడు.. ఎప్పటికి మరిచిపోను | Dale Steyn Recalls Sreesanth Six On Andre Nel Gives Chills Every Time | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టి మరీ సిక్స్‌ కొట్టించాడు.. ఎప్పటికి మరిచిపోను

Published Sun, May 16 2021 5:25 PM | Last Updated on Sun, May 16 2021 9:20 PM

Dale Steyn Recalls Sreesanth Six On Andre Nel Gives Chills Every Time - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: టీమిండియా సీనియర్‌ బౌలర్‌ శ్రీశాంత్‌​ తన కెరీర్‌లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్‌ అయ్యాడు. అయితే అతని బౌలింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బ్యాటింగ్‌ లెజెండ్స్‌ జాక్‌ కలిస్‌, బ్రియాన్‌ లారాలను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్‌లో తన పవరేంటో చూపెట్టిన  శ్రీశాంత్‌ ఒక మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ చేసింది ఏడు పరుగులు..  కొట్టింది ఒకే ఒక్క సిక్స్‌.  కానీ ఆ సిక్స్‌ ప్రత్యర్థి బౌలర్‌కు ఎప్పటికి గుర్తుండి పోయేలా చేశాడు.

2006లో టీమిండియా ఐదు వన్డేలు.. మూడు టెస్టులు, ఒక టీ20 ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్టు సిరీస్‌లో భాగంగా వాండరర్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆండ్రూ నెల్‌ అప్పటికే మూడు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. క్రీజులో ఉన్న శ్రీశాంత్‌ను చూస్తూ ఏదో స్లెడ్జ్‌ చేశాడు. అసలే కోపానికి చిరునామాగా ఉండే శ్రీశాంత్‌కు అతని  మాటలు మరింత కోపం తెప్పించాయి. ఆండ్రూ వేసిన బంతిని భారీ సిక్స్‌ బాదాడు. అంతే ఆండ్రూ ముఖంలో కోపం.. శ్రీశాంత్‌లో నవ్వు ఒకేసారి కనిపించాయి. ఇంతటితో ఆగకుండా శ్రీశాంతక్ష తన బ్యాట్‌ను అతనివైపు చూస్తూ.. పనిచేసుకో అన్నట్లుగా స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కాగా ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ బౌలింగ్‌లో 8 వికెట్లతో దుమ్మురేపి టీమిండియాకు 123 పరుగులతో భారీ విజయాన్నిఅందించాడు.


తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ను ఇంటర్వ్యూ చేసింది. మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్‌ అనిపించేలా.. బ్యాట్స్‌మన్‌ కొట్టిన షాట్‌ గురించి చెప్పండి అంటే అడిగాడు. దానికి శ్రీశాంత్‌ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసుకున్నాడు. ''ఆండ్రూ నెల్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ కొట్టిన సిక్స్‌ ఎప్పటికి మరిచిపోను. అతన్ని గెలికి మరీ సిక్స్‌ కొట్టించాడు. సిక్స్‌ కొట్టిన అనంతరం శ్రీశాంత్‌ తన బ్యాట్‌ను స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్న మూమెంట్‌ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా నన్ను చిల్‌ చేస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక శ్రీశాంత్‌ ఆండ్రూ నెల్‌తో జరిగిన కాంట్రవర్సీ గురించి తర్వాత స్పందించాడు. ''ఆరోజు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి ఇండియన్స్‌కు పెద్ద మనసు ఉండదని.. మీతో పోలిస్తే మేము చాలా బెటర్‌ అంటూ కామెంట్స్‌ చేశాడు. నాకు కోపం వచ్చింది.. అప్పటికే మా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఔటయ్యారు. ఆండ్రూకు మా స్కోర్‌బోర్డు చూపిస్తూ..' మేం ఆధిక్యంలో ఉన్నాం.. తర్వాత ఏ జరుగుతుందో నువ్వే చూడు' అని సైగ చేసి సిక్స్‌ బాదాను.. అంతే అతని కళ్లలో కోపం చూసి నేను సెలబ్రేట్‌ చేసుకున్నా'' అంటూ తెలిపాడు. ఇక శ్రీశాంత్‌ టీమిండియా తరపున  27 టెస్టుల్లో 87 వికెట్లు.. 53 వన్డేల్లో 75 వికెట్లు.. 10టీ20ల్లో 7 వికెట్లు తీశాడు.
చదవండి: 'ఆ నెంబర్‌ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement