జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆతర్వాత రెండో టీ20 బ్యాట్‌తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.
మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.
మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్‌ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్‌కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.
మరోవైపు ఈ సిరీస్‌లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్‌మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment