ICC WC 2023- Ind Vs Pak- Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు బాబర్ కెప్టెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాల్సింది పోయి.. పిరికివాడిలా వెనుకడుగు వేశాడని విమర్శిస్తున్నారు. భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడేటపుడు ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని బాబర్‌కు సూచనలు ఇస్తున్నారు.
భారత బౌలర్ల విజృంభణ.. బాబర్ బృందం బెంబేలు
కాగా భారత గడ్డపై తొలిసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన వన్డే నంబర్ 1 బ్యాటర్ బాబర్ ఆజం.. అక్టోబరు 14 నాటి అహ్మదాబాద్ మ్యాచ్‌లో 50 పరుగులు సాధించాడు. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పరిమితమైన వేళ ఈ వన్‌డౌన్ బ్యాటర్.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(49)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
అయితే, భారత బౌలర్ల దాటికి ఈ జోడీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. ఇక వీరిద్దరి తర్వాత హసన్ అలీ తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో 191 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో 30.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడంతో పాకిస్తాన్‌కు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో మరోసారి దాయాది చేతిలో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్ బాబర్ ఆజం తీరును తప్పుబట్టారు.
ఇకనైనా కెప్టెన్సీ వదిలెయ్యాలి
‘‘బాబర్ ఆజం ఏదో అలా జట్టును నడిపిస్తున్నాన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ.. నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. భారత్ వంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ ఉన్నపుడు బాబర్ ఆజం ప్లాన్ ‘బి’, ప్లాన్ ‘సి’తో బరిలోకి దిగాలి.
కానీ.. మ్యాచ్ చూస్తున్నంత సేపు.. బాబర్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టంగా తేలిపోయింది. ఇప్పటికైనా బాబర్ కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పైనే పూర్తిగా దృష్టి సారించాలి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని షోయబ్ మాలిక్ ఏ- స్పోర్ట్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
మరీ ఇంత పిరికితనమా? నాయకుడే ఇలా ఉంటే
ఇక మొయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆరంభం నుంచే పూర్తి ఒత్తిడిలో కూరుకుపోయినట్లుగా అనిపించింది. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు బాబర్ భయం భయంగా కనిపించాడు. ఏ షాట్ ఆడితే ఏమవుతుందోనన్న ఆందోళన అతడిలో కనిపించింది. కెప్టెన్ పరిస్థితే అలా ఉంటే ఆటగాళ్లు ఎలా ఆడతారు? వాళ్లు కూడా బాబర్ లాగే భయపడిపోయారు.
బాబర్ ఆజం 50 పరుగులు చేయడానికి 58 బంతులు తీసుకున్నాడు. తన సహజమైన శైలిలో అతడు బ్యాటింగ్ చేయలేకపోవడం మనమంతా చూశాం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే డిఫెన్సివ్‌గా ఆడాడు. వికెట్లు పడుతున్నపుడు జాగ్రత్త అవసరమే..
కానీ మరీ పిరికివాడిలా మారిపోయి బౌలర్లపై ఎదురుదాడి చేయకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని బాబర్ ఆజం ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. కాగా అహ్మదాబాద్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ అయిన విషయం తెలిసిందే.
చదవండి: WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే!
Comments
Please login to add a commentAdd a comment