ICC ODI WC 2023- Ind Won By 7 Wickets- Babar Azam On Loss: వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌కు మరోసారి టీమిండియా చేతిలో పరాభవం ఎదురైంది. ఈ ఐసీసీ ఈవెంట్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థిపై గెలవాలన్న పాక్ ఇంకోసారి భంగపాటుకు గురైంది. భారత్ వేదికగా పటిష్ట రోహిత్ సేన ముందు బాబర్ ఆజం బృందం తలవంచక తప్పలేదు.
సొంతగడ్డపై హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టును నిలువరించలేకపోయింది. ఏకపక్ష విజయంతో టీమిండియా మరోసారి సంబరాలు చేసుకోగా పాకిస్తాన్ ఈసారికి ఇంతే అని సరిపెట్టుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా- పాకిస్తాన్ తొలిసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐదుగురూ రెండు చొప్పున
కెప్టెన్ నిర్ణయాన్ని, నమ్మకాన్ని నిజం చేస్తూ భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా.. రెండేసి వికెట్లు తీసి పాక్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు.
ఐదుగురూ రెండేసి వికెట్లు సరిసమానంగా పంచుకుని.. 191 పరుగులకు పాకిస్తాన్‌ను ఆలౌట్ చేశారు. 42.5 ఓవర్లకే పాక్ బ్యాటర్ల కథను ముగించేశారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగుల(6 ఫోర్లు, 6 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(53- నాటౌట్), కేఎల్ రాహుల్(19- నాటౌట్)తో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 16, విరాట్ కోహ్లి 16 పరుగులకే అవుటయ్యారు.
భారత్ హ్యాట్రిక్.. పాక్ జోరుకు బ్రేక్
కాగా 30.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి టీమిండియా పాకిస్తాన్‌పై జయభేరి మోగించి తాజా వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హ్యాట్రిక్ విజయం అందుకుంది. దీంతో గత రెండు మ్యాచ్‌లలో గెలిచి జోష్‌లో ఉన్న పాకిస్తాన్ జోరుకు బ్రేక్ పడింది.
మా ఓటమికి ప్రధాన కారణం అదే
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. ‘‘మాకు శుభారంభమే లభించింది. నేను, ఇమామ్ కలిసి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాం. ఇక రిజ్వాన్, నేనూ నార్మల్‌గానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. సరైన రీతిలో ఇన్నింగ్స్ ముగించలేకపోయాం.
అతడు అద్భుతం
మేము ఇన్నింగ్స్ మొదలెట్టిన తీరుకు కనీసం 280- 290 పరుగులు స్కోరు చేసే వాళ్లం. కొత్త బంతితో మా బౌలర్లు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు. ఇక టీమిండియా సారథి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడన్న బాబర్.. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడంటూ హిట్‌మ్యాన్‌ను ప్రశంసించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 50 పరుగులు పూర్తి చేసుకోగానే సిరాజ్ అతడిని క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇక 49 పరుగుల వద్ద ఉన్న రిజ్వాన్‌ను బుమ్రా బౌల్డ్ చేసిన తర్వాత పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
Comments
Please login to add a commentAdd a comment