వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఇకపై ఆసీస్ జట్టులో చోటు దక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్న వార్నర్‌కు నాలుగో టెస్ట్‌లో చోటు దక్కదని ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ పరోక్షంగా చెప్పాడు. వయసు పైబడటం, ఫామ్ లేమి, గతంతో పోలిస్తే చురుకుదనం లోపించడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని ఆసీస్ మేనేజ్‌మెంట్ స్టార్ క్రికెటర్‌పై వేటు వేయవచ్చు.
మరి వార్నర్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకునే వరకు తెచ్చుకుంటాడా..? లేక హుందుగా యాషెస్ నాలుగో టెస్ట్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న విషయంపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. వార్నర్ తన రిటైర్మెంట్‌కు ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ, ఇంత హడావుడిగా ఈ విషయంపై చర్చకు కారణం లేకపోలేదు.
మూడో టెస్ట్‌లో ఆసీస్ ఓటమి అనంతరం వార్నర్ భార్య క్యాండిస్ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో క్యాండిస్.. వార్నర్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై సంకేతాలు ఇచ్చింది. తమ కుటుంబం మొత్తం ఉన్న ఫోటోను షేర్ చేస్తూ క్యాండిస్ ఇలా రాసుకొచ్చింది. టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఈ ప్రయాణం చాలా సరదాగా ఉండింది. చిరకాలం నీ అతి పెద్ద మద్దతుదారులు.. నీ గర్ల్ గ్యాంగ్.. లవ్ యూ వార్నర్ అంటూ క్యాండిస్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఈ పోస్ట్‌లో క్యాండిస్.. వార్నర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసేసుకున్నట్లే రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తక్షణమే వార్నర్ రిటైర్మెంట్ అమల్లోకి వస్తుందనే భావన కలిగిస్తుంది. దీంతో అభిమానులు యాషెస్ నాలుగో టెస్ట్ ఆడకుండానే వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అనుకుంటున్నారు. ఇకపై ఎలాగూ జట్టులో చోటు దక్కదని తెలిసి వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రీ పోన్ చేసుకున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ ఏం ప్రకటన చేస్తాడో తేలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.
కాగా, వార్నర్ వచ్చే ఏడాది (2024) జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (పాకిస్తాన్) ఆడనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హుందాగా తప్పుకోవడమే మంచిదని భావించి, వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రీ పోన్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో మూడు టెస్ట్‌లు ఆడిన వార్నర్ కేవలం ఒక్క అర్ధసెంచరీ సాయంతో 141 పరుగులు మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment