
సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మెకాయ్ తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో మెకాయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను నాలుగురు బౌలర్లు అందుకున్నారు. అజంతా మెండిస్ రెండు సార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఉన్నారు.
అయితే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టిన రికార్డు మాత్రం భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. చహర్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వేపై 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?