
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో లండన్ స్పిరిట్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దీప్తి.. తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టింది. నిన్నటి మ్యాచ్‌లో లండన్ గెలవాలంటే చివరి మూడు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో దీప్తి చేసింది 16 పరుగులే అయినా జట్టు విజయానికి అవెంతో దోహదపడ్డాయి.
హండ్రెడ్ లీగ్ ప్రారంభ మ్యాచ్ నుంచి దీప్తి ఇలాంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో బ్యాట్‌తో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె.. 212 సగటున, 132.50 స్ట్రయిక్‌రేట్‌తో 212 పరుగులు చేసింది. ఇందులో దీప్తి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 46 నాటౌట్ కాగా.. 18 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దీప్తి.. 6.85 ఎకానమీతో ఎనిమిది వికెట్లు తీసింది. వెల్ష్ ఫైర్‌తో నిన్న జరిగిన ఫైనల్లో దీప్తి ఎల్విస్ వికెట్ పడగొట్టింది.