![Delhi Capitals beat Mumbai Indians by 2 wickets](/styles/webp/s3/article_images/2025/02/16/wpl.jpg.webp?itok=UGy93Guz)
ఉత్కంఠపోరులో ముంబై ఓటమి
2 వికెట్లతో గట్టెక్కిన క్యాపిటల్స్
నాట్ సీవర్ పోరాటం వృథా
గెలిపించిన షఫాలీ, నికీ ప్రసాద్
వడోదర: లక్ష్యఛేదనలో ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...అయితే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారడంతో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఆపై డ్రామా సాగింది... ఆఖరి బంతి దాకా సాగిన రనౌట్/నాటౌట్ హంగామా ఢిల్లీనే గట్టెక్కించింది. కలిత వేసిన 20వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులు రాగా, ఐదో బంతికి నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ తొలి పరుగు పూర్తి చేసింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో ఆమె పడిన డైవ్‌తో బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలడంతో రెండో పరుగొచ్చింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడింది.
డబ్ల్యూపీఎల్‌లో శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ గెలిచేందుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది.
సీవర్, హర్మన్ దంచేసినా...
ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (0), యస్తిక (11) సహా ఆఖరి వరుస బ్యాటర్లు షబ్నమ్ (0), సైకా ఇషాక్ (0) వరకు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. వన్‌డౌన్‌లో నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరే ముంబైని ఆదుకున్నారు.
వాళ్లిదరు మెరిపించడంతో ఒకానొక దశలో ముంబై 10.3 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించాక ధాటిగా ఆడుతున్న కెపె్టన్ హర్మన్ అవుటైంది. తర్వాత వచ్చినవారెవరూ బాధ్యత కనబర్చలేదు. కానీ సీవర్ బ్రంట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి ఆఖరిదాకా అజేయంగా పోరాడింది.
అదరగొట్టిన షఫాలీ
ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్‌తో కెపె్టన్ మెగ్ లానింగ్ (15)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభమిచ్చింది. ఆరో ఓవర్ ఐదో బంతికి షఫాలీ జోరుకు హేలీ కళ్లెం వేయగా, మరుసటి ఓవర్లో లానింగ్‌ను షబ్నమ్ అవుట్ చేసింది. తర్వాత జెమీమా (2), అనాబెల్ సదర్లాండ్ (13), అలైస్ క్యాప్సి (16)లు విఫలమవడంతో ఢిల్లీ ఆట పడుతూలేస్తూ సాగింది.
ఈ దశలో నికీ ప్రసాద్, సారా బ్రైస్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ ఆరో వికెట్‌కు వేగంగా 31 పరుగులు జతచేయడంతో ఢిల్లీ గెలుపుదారిలో పడింది. స్వల్పవ్యవధిలో సారా, శిఖాపాండే (2) నిష్క్రమించినా ఆఖరి బంతి దాకా పోరాడిన ఢిల్లీ టెయిలెండర్లు జట్టును గెలిపించారు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) శిఖాపాండే 11; హేలీ (సి) లానింగ్ (బి) శిఖాపాండే 0; సీవర్ బ్రంట్ నాటౌట్ 80; హర్మన్‌ప్రీత్ (సి) నికీ (బి) అనాబెల్ 42; అమెలియా రనౌట్ 9; సజన (సి) బ్రైస్ (బి) అనాబెల్ 1; అమన్‌జ్యోత్ (బి) క్యాప్సి 7; సంస్కృతి (సి) లానింగ్ (బి) మిన్నుమణి 2; కలిత రనౌట్ 1; షబ్నిమ్ రనౌట్ 0; సైకా ఇషాక్ (బి) అనాబెల్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–105, 4–129, 5–133, 6–146, 7–156, 8–159, 9–160, 10–164.
బౌలింగ్: శిఖా పాండే 4–0–14–2, అలైస్ క్యాప్సి 2–0– 25–1, అరుంధతి 4–0– 40–0, మిన్నుమణి 4–0–23–1, అనాబెల్ 3.1–0–34–3, రాధా యాదవ్ 2–0–26–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) షబ్నమ్ 15; షఫాలీ (సి) అమన్‌జ్యోత్ (బి) హేలీ 43; జెమీమా (సి) హర్మన్‌ప్రీత్ (బి) అమెలియా 2; అనాబెల్ (బి) సీవర్ బ్రంట్ 13; క్యాప్సి (సి) షబ్నమ్ (బి) అమెలియా 16; నికీ ప్రసాద్ (సి) అమెలియా (బి) కలిత 35; సారా బ్రైస్ (సి) కలిత (బి) హేలీ 21; శిఖా పాండే రనౌట్ 2; రాధా యాదవ్ నాటౌట్ 9; అరుంధతీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–66, 4–76, 5–109, 6–140, 7–147, 8–163. బౌలింగ్: షబ్నమ్ 4–0–18–1, సైకా 3–0–43–0, సీవర్ బ్రంట్ 4–0–38–1, హేలీ మాథ్యూస్ 4–0–31–2, అమెలియా కెర్ 4–0–22–2, కలిత 1–0–10–1.
శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణా
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఆమె బరిలోకి దిగలేదు.
శ్రేయ స్థానంలో స్నేహ్ రాణాను ఆర్‌సీబీ జట్టులోకి తీసుకున్నారు. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది.
డబ్ల్యూపీఎల్‌లో నేడు
గుజరాత్ X యూపీ వారియర్స్
రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment