ధర్శశాల: ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఇతర జట్ల సమీకరణాలను దెబ్బ తీసే పనిలో పడింది. పదునైన బ్యాటింగ్‌తో తొలిసారి సీజన్‌లో 200 పరుగుల స్కోరు చేసిన ఆ జట్టు పంజాబ్ కింగ్స్‌ను దెబ్బ కొట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (48 బంతుల్లో 94; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా, అథర్వ తైడే (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది!
మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు...
వార్నర్ ఎప్పటిలాగే శుభారంభం అందించగా... చాలా రోజుల తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా దానిని సమర్థంగా వాడుకున్నాడు. రబడ ఓవర్లో వార్నర్ 2 సిక్స్‌లు కొట్టగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుస బంతుల్లో పృథ్వీ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 94 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ వెనుదిరగ్గా, మూడో స్థానంలో వచ్చి న రోసో మరింత జోరుగా బ్యాటింగ్ చేశాడు.
రబడ ఓవర్లో అతను 2 భారీ సిక్స్‌లతో పాటు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీ ఆ వెంటనే వెనుదిరిగాడు. రోసో, సాల్ట్ (14 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో ఆఖరి 2 ఓవర్లలోనే ఢిల్లీ 41 పరుగులు రాబట్టింది. హర్‌ప్రీత్ వేసిన చివరి ఓవర్లో రోసో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టగా, అంతకుముందు ఎలిస్ వేసిన 19వ ఓవర్లో సాల్ట్ కూడా 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. 25 బంతుల్లోనే రోసో హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
లివింగ్‌స్టోన్ మెరుపులు...
శిఖర్ ధావన్ (0) డకౌట్ కావడంతో ఛేదనలో పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే తైడే, ప్రభ్‌సిమ్రన్ (22) రెండో వికెట్‌కు 33 బంతుల్లో 50 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వేగంగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తైడే ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకోగా, జితేశ్ శర్మ (0) విఫలమయ్యాడు.
మరోవైపు 3 పరుగుల వద్ద నోర్జే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన లివింగ్‌స్టోన్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అతని ఆటతోనే పంజాబ్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. చివరి 4 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన దశలో లివింగ్‌స్టోన్... ఖలీల్ ఓవర్లో రెండు, ముకేశ్ ఓవర్లో మూడు సిక్స్‌లు బా దాడు. 19వ ఓవర్లో అతనికి ఒక బంతే ఆడే అవకా శం రాగా... ఇషాంత్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ధావన్ (బి) స్యామ్ కరన్ 46; పృథ్వీ షా (సి) తైడే (బి) స్యామ్ కరన్ 54; రోసో (నాటౌట్) 82; సాల్ట్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–94, 2–148. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–36–2, రబడ 3–0–36–0, అర్ష్ దీప్ 2–0–21–0, ఎలిస్ 4–0–46–0, చహర్ 4–0–35–0, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–39–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) ధుల్ (బి) అక్షర్ 22; ధావన్ (సి) అమన్ (బి) ఇషాంత్ 0; అథర్వ తైడే (రిటైర్డ్ అవుట్) 55; లివింగ్‌స్టోన్ (సి) అక్షర్ (బి) ఇషాంత్ 94; జితేశ్ (సి) ఖలీల్ (బి) నోర్జే 0; షారుఖ్ (సి) అక్షర్ (బి) ఖలీల్ 6; స్యామ్ కరన్ (బి) నోర్జే 11; బ్రార్ (రనౌట్) 0; చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–0, 2–50, 3–128, 4–129, 5–147, 6–180, 7–180, 8–198. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 3–1–20–1, ఇషాంత్ శర్మ 3–0–36–2, నోర్జే 4–0–36–2, ముకేశ్ 4–0–52–0, అక్షర్ పటేల్ 3–0–27–1, కుల్దీప్ యాదవ్ 3–0–21–0.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ vs బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment