వైఎస్సార్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌కు ఏర్పాట్లు
నేడు డీసీ, సీఎస్‌కే మధ్య మ్యాచ్
నెట్స్‌లో చెమటోడ్చిన ఇరుజట్లు
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విశాఖ నగరానికి మళ్లీ వచ్చేసింది. వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నె సూపర్‌కింగ్స్ జట్లు తలపడనున్నాయి. విజయపరంపరను కొనసాగించేందుకు సీఎస్‌కే పట్టుదలగా ఉండగా హోమ్‌గ్రౌండ్‌లో విజయంతో శుభారంభం చేయడానికి డీసీ జట్టు ప్రణాళిక రచించింది. 2019 ఐపీఎల్ సీజన్ నాకవుట్‌లో క్వాలిఫైయిర్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగ్గా ముఖాముఖీ పోరులో డీసీపై సీఎస్‌కే జట్టు విజయం సాధించిన విషయం విదితమే.
మళ్లీ ఇప్పుడు మ్యాచ్ జరగనుండడంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్‌లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. గంటలోనే మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా శనివారం సైతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లను ఫిజికల్ టికెట్లగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా అభిమానులు రిడీమ్ చేసుకున్నారు.
స్టేడియంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే జట్టు ఫ్రాంచైజీ అధినేతతో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథ్‌రెడ్డి, నగర సీపీ రవిశంకర్ కాసేపు ముచ్చటించారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రత చర్యల గురించి చర్చించారు.
నేడు ట్రాఫిక్ మళ్లింపు
విశాఖ సిటీ: ఐపీఎల్ మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌కు 28 వేల మంది వీక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు భద్రతా చర్యలతో పాటు మరోవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. మ్యాచ్‌తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment