
6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
కుల్దీప్ మాయాజాలం
ఫ్రేజర్, పంత్ మెరుపులు
లక్నో: ఐపీఎల్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ముందుగా బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు బాధ్యత కనబరచడంతో పంత్ బృందం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3, పేసర్ ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆ్రస్టేలియా యువతార జేక్ ఫ్రేజర్ మెగర్క్ (35 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఢిల్లీ గెలుపుతో కీలకపాత్ర పోషించారు.
ఆదుకున్న బదోని
ఆరంభంలో ధాటిగా ఆడిన లక్నో జట్టు పవర్‌ప్లేలో 57/2 స్కోరు చేశాక కుల్దీప్ ఉచ్చులో పడింది. వరుస బంతుల్లో స్టొయినిస్ (8), పూరన్ (0)లను కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ (22 బంతుల్లో 39, 5 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (10), కృనాల్ పాండ్యా (3)ల వైఫల్యంతో 94 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఆయుశ్ బదోని... అర్షద్ (16 బంతుల్లో 20 నాటౌట్)తో కలిసి 8వ వికెట్‌కు 73 పరుగులు జోడించాడు.
సిక్సర్లతో అలరించి...
ఢిల్లీ జట్టు ఆరంభంలోనే వార్నర్ (8), పృథ్వీషా (22 బంతుల్లో 32; 6 ఫోర్లు)లను కోల్పోయింది. అయితే ఫ్రేజర్, రిషభ్ పంత్ లక్నో బౌలర్ల భరతం పట్టి ఢిల్లీని లక్ష్యంవైపు నడిపించారు. కృనాల్ 13వ ఓవర్లో ఫ్రేజర్ మూడు వరుస సిక్స్‌లు బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి.
31 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయ్యింది. జట్టు స్కోరు 140 వద్ద ఫ్రేజర్‌ను నవీనుల్ పెవిలియన్ చేర్చగా మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే పంత్‌ను బిష్ణోయ్ అవుట్ చేయగా, మిగతా లాంఛనాన్ని స్టబ్స్ (15 నాటౌట్), హోప్ (11 నాటౌట్) పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఖలీల్ 19; రాహుల్ (సి) పంత్ (బి) కుల్దీప్ 39; పడిక్కల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఖలీల్ 3; స్టొయినిస్ (సి) ఇషాంత్ (బి) కుల్దీప్ 8; పూరన్ (బి) కుల్దీప్ 0; హుడా (సి) వార్నర్ (బి) ఇషాంత్ 10, బదోని (నాటౌట్) 55; కృనాల్ (సి) పంత్ (బి) ముకేశ్ 3; అర్షద్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–28; 2–41, 3–66, 4–66, 5–77, 6–89, 7–94. బౌలింగ్: ఖలీల్ 4–0– 41–2, ఇషాంత్ 4–0–36–1, ముకేశ్ 4–0–41–1, అక్షర్ 4–0–26–0, కుల్దీప్ 4–0–20–3.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీషా (సి) పూరన్ (బి) బిష్ణోయ్ 32; వార్నర్ (బి) యశ్ 8; ఫ్రేజర్ (సి) అర్షద్ (బి) నవీనుల్ 55; పంత్ (స్టంప్డ్) రాహుల్ (బి) బిష్ణోయ్ 41; స్టబ్స్ (నాటౌట్) 15; హోప్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–24, 2– 63, 3–140, 4–146. బౌలింగ్: అర్షద్ 3.1–0 –34–0, నవీనుల్ 3–0–24–1, యశ్ ఠాకూర్ 4–0–31–1, కృనాల్ 3–0–45–0, రవి బిష్ణోయ్ 4–0–25–2,
స్టొయినిస్ 1–0–10–0.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ X రాజస్తాన్
వేదిక: ముల్లాన్‌పూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment