
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పందొమ్మిదేళ్ల ఈ యువ సంచలనం అద్భుత ఆట తీరుతో తనకు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)ను గుర్తుచేశాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్‌లోనూ చితక్కొట్టిన ఇలాంటి బ్యాటర్‌ను తాను చూడలేదంటూ కొన్‌స్టాస్‌ను రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.
మెస్వీనీ స్థానంలో
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా నాథన్ మెక్‌స్వీనీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల తర్వాత అతడిపై వేటు పడింది. వరుస ఇన్నింగ్స్‌లో విఫలమైన మెక్‌స్వీనీ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా సామ్ కొన్‌స్టాస్‌కు పిలుపునిచ్చింది.
ఊహించని రీతిలో దంచికొట్టాడు
ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా పందొమ్మిదేళ్ల ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆరంభంలో భారత బౌలర్లకు ఎదుర్కొనేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత ఊహించని రీతిలో దంచికొట్టాడు.
బుమ్రాకే చుక్కలు చూపించాడు
ముఖ్యంగా బుమ్రాను కొన్‌స్టాస్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2021 సిడ్నీ టెస్టులో చివరిసారిగా బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా... మూడేళ్ల తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో మళ్లీ కొన్‌స్టాస్ రివర్స్ స్కూప్ ద్వారా సిక్స్ బాదాడు. తద్వారా తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 60 పరుగులు సాధించాడు.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సామ్ కొన్‌స్టాస్ ఆట తీరును తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘‘కేవలం టెస్టులే కాదు.. వన్డే, టీ20లలోనూ బుమ్రాను ఇలా ట్రీట్ చేసిన బ్యాటర్‌ను చూడలేదు. విధ్వంసకర షాట్లు ఆడటంలో అతడు తన స్వాగ్‌ను చూపించాడు. క్రికెట్ నిబంధనలనే మార్చేసేలా అతడి ఆట ఉందనడం అతిశయోక్తి కాదు.
వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడు
ఒకానొక సమయంలో కొన్‌స్టాస్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు లేక టీమిండియా బిక్క ముఖం వేసినట్లు కనిపించింది. ఆరంభంలో అతడు రెండు షాట్లు మిస్ చేసినపుడు కనిపించిన ఆనందం.. కాసేపట్లోనే ఆవిరైంది. అతడు హిట్టింగ్ మొదలుపెట్టగానే నాకు వీరేంద్ర సెహ్వాగ్ జ్ఞప్తికి వచ్చాడు.
క్రీజులో కుదురుకున్నాక వీరూ ఎంతగా వినోదం పంచుతాడో.. కొన్‌స్టాస్ కూడా అలాగే చేశాడు. ఆసీస్ జట్టులో కొన్‌స్టాస్ గనుక తన స్థానం సుస్థిరం చేసుకుంటే భవిష్యత్తులో అతడికి తిరుగు ఉండదు’’ అని కొన్‌స్టాస్‌పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కొన్‌స్టాస్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం
WHAT ARE WE SEEING!
Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO— cricket.com.au (@cricketcomau) December 26, 2024