టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు: బాబర్‌ ఆజం | Easy to Give Advice on TV: Babar Azam Quashes Aside Captaincy Pressure | Sakshi
Sakshi News home page

టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు.. అలా కాకుండా: బాబర్‌ ఆజం

Published Fri, Nov 10 2023 6:19 PM | Last Updated on Fri, Nov 10 2023 6:27 PM

Easy to Give Advice on TV: Babar Azam Quashes Aside Captaincy Pressure - Sakshi

‘‘గత మూడేళ్లుగా.. నాయకుడిగా మా జట్టును ముందుకు నడిపిస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలా ఫీల్‌ అవలేదు. వరల్డ్‌కప్‌లో నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం వల్లే కొంతమంది నా గురించి ఇలా మాట్లాడుతున్నారు.

నేను ఒత్తిడిలో కూరుకుపోయానని వాళ్లే ఊహించుకుంటున్నారు. నిజానికి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. గత రెండున్నర, మూడేళ్లుగా కెప్టెన్‌గా నా ప్రదర్శన ఎలా ఉందో నాకు తెలుసు.

అప్పుడు బ్యాటింగ్‌ చేసింది నేనే.. కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపిందీ నేనే.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నా! అయితే, ఒక విషయాన్ని మనం ఏ కోణం నుంచి చూస్తున్నామన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది.

ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉండటం సహజం. ఎవరికి వారే తాము ప్రత్యేకం అనుకుంటారు. కానీ.. కొంత మంది మాత్రం తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు.

‘అతడు అలా ఆడితే బాగుండు.. ఇలా చేస్తే బాగుండు’ అని తోచింది చెబుతూ ఉంటారు. టీవీల ముందు కూర్చుని మాట్లాడటం సులభమే. 

నా గురించి మాట్లాడుతున్న వాళ్లందరి దగ్గరా నా ఫోన్‌ నంబర్‌ ఉంది. నిజంగా మీరు నాకేదైనా సలహా ఇవ్వాలనుకుంటే నేరుగా నాకు మెసేజ్‌ చేయండి’’ అంటూ పాకిస్తాన్‌ కెప్టెన్ బాబర్‌ ఆజం విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో వ్యక్తిగతంగా తన ప్రదర్శన బాగానే ఉందన్న బాబర్‌.. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం పడటం లేదని స్పష్టం చేశాడు. తాను పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నానని పేర్కొన్నాడు. 

కాగా భారత్‌ వేదికగా ‍ప్రపంచకప్‌-2023 టోర్నీలో ఆరంభంలో విజయాలు సాధించిన పాకిస్తాన్‌ ఆ తర్వాత చతికిలపడింది. బ్యాటర్‌గానూ బాబర్‌ ఆశించిన రీతిలో ఆడలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. కెప్టెన్సీ వదిలేస్తేనే బాబర్‌ బాగుపడతాడంటూ పాక్‌ మాజీ క్రికెటర్లు సలహాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో లీగ్‌ దశలో ఆఖరిగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బాబర్‌ ఆజం మీడియాతో మాట్లాడుతూ విమర్శకులకు కౌంటర్‌ వేశాడు. ఇదిలా ఉంటే.. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్న పాక్‌కు న్యూజిలాండ్‌ షాకిచ్చిన విషయం తెలిసిందే. 

బెంగళూరు వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించి అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో పాక్‌ ఇంకా సెమీస్‌ చేరాలని భావిస్తే ఇంగ్లండ్‌పై 287 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. బాబర్‌ ఆజం ఈ ప్రపంచకప్‌లో గత నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలు బాదాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement