‘ఈసారి అతడిని కెప్టెన్‌ చేయకపోతే పాక్‌ జట్టుకు అధోగతే’ | If You Dont Make Him Captain At This Time: Basit Ali On Mohammad Rizwan | Sakshi
Sakshi News home page

‘ఈసారి అతడిని కెప్టెన్‌ చేయకపోతే పాక్‌ జట్టుకు అధోగతే’

Published Mon, Sep 16 2024 2:26 PM | Last Updated on Mon, Sep 16 2024 4:48 PM

If You Dont Make Him Captain At This Time: Basit Ali On Mohammad Rizwan

ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్‌ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్‌ ఆఫ్రిది వంటి పాక్‌ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్‌ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్‌కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.

సరైన నిర్ణయం తీసుకోకపోతే
బాబర్‌ ఆజం స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు పాక్‌ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్‌ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్‌ క్రికెట్‌ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాక్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్‌ మసూద్‌, టీ20లకు షాహిన్‌ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు అనూహ్యంగా షాహిన్‌పై వేటు వేసిన పాక్‌ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్‌కు అప్పగించింది. 

అయితే, గత టీ20 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్‌-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్‌పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ బసిత్‌ అలీ మాట్లాడుతూ.. మహ్మద్‌ రిజ్వాన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. 

చాంపియన్స్‌ వన్డే కప్‌-2024లో అతడు మార్ఖోర్స్‌ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్‌ బదులు రిజ్వాన్‌ను పాకిస్తాన్‌ కెప్టెన్‌ చేయాలని సూచించాడు.

బాబర్‌ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు
‘‘తన కంటే పాకిస్తాన్‌కు మెరుగైన కెప్టెన్‌ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్‌ చాంపియన్స్‌ కప్‌లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్‌ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్‌ మసూద్‌ కూడా రిజ్వాన్‌లా జట్టుకు న్యాయం చేయలేడు.

ఈసారి గనుక రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్‌ క్రికెట్‌కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్‌ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్‌ వన్డే కప్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ మార్ఖోర్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్‌ ఆజం స్టాలియన్స్‌ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. 

చదవండి: 4,4,4,4,4: బాబర్‌ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement