క్రికెట్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. బ్యాటింగ్‌లో ఈ జోడి పోషించే పాత్రపైనే ఇన్నింగ్స్ మొత్తం ఆధారపడి ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సచిన్-సెహ్వాగ్, సచిన్-గంగూలీ, మాథ్యూ హెడెన్-గిల్‌క్రిస్ట్, హెడెన్-జస్టిన్ లాంగర్, గ్రేమీ స్మిత్-హర్షలే గిబ్స్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా ముద్రపడ్డారు. వీళ్లే కాదు ఇంకా చాలా ఓపెనింగ్ జోడీలున్నాయి.. చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టు వస్తుంది.
మనం చెప్పుకున్న లిస్టులో పాకిస్తాన్ జోడి బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్‌లకు కూడా కచ్చితంగా స్థానం ఉంటుంది. గత రెండేళ్లుగా ఈ జోడి పరుగుల మీద పరుగులు చేస్తూ రికార్డులు సృష్టించారు. 2021 ఏడాదిలో ఈ జోడి 50.47 సగటుతో 2019 పరుగులు జోడించారు. దీన్నబట్టే అర్థం చేసుకోవచ్చు.. బాబర్-రిజ్వాన్ జోడి ఎంత సక్సెస్ అయిందనేది.
అయితే ఈ సక్సెస్ ఇప్పుడు వారిద్దరిని చిక్కుల్లో పడేసింది. కొంతకాలంగా బాబర్-రిజ్వాన్ జోడి స్థిరంగా పరుగులు చేయలేకపోతుంది. ముఖ్యంగా బాబర్ ఆజం ఆట నాసిరకంగా తయారైంది. టి20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకముందు ఆసియా కప్‌లోనూ ఇదే పరిస్థితి. తాజాగా అదే ఫేలవ ఫామ్‌ను టి20 ప్రపంచకప్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. అటు కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు జింబాబ్వే కూడా షాకిచ్చింది. ఈ దెబ్బకు బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అసలే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బాబర్‌కు ఇది పెద్ద దెబ్బ. కొందరైతే ఏకంగా బాబర్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి ఉద్వాసన పలకాలని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మహ్మద్ రిజ్వాన్ పరిస్థితి మరోలా ఉంది. టి20 ప్రపంచకప్ ముందు వరకు రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చెప్పాలంటే 2021 నుంచి రిజ్వాన్ భీకరమైన ఫామ్ కనబరుస్తున్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన మహ్మద్ రిజ్వాన్ ఆ స్థానానికి తాను కరెక్టే అన్నట్లుగా ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతూ వచ్చాడు. అయితే టి20 ప్రపంచకప్‌లో మాత్రం రిజ్వాన్ ఆ ఫామ్‌ను చూపెట్టలేకపోతున్నాడు. అయితే ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్‌లు మాత్రమే కాబట్టి.. అతన్ని తక్కువ అంచనా వేయలేము. అతని ఫామ్‌లో ఉన్నానని చెప్పడానికి ఒక నిఖార్సైన ఇన్నింగ్స్ చాలు.
కానీ అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో ఓపెనింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడి మూడు ఫార్మట్లలోనూ ఓపెనింగ్ స్లాట్‌లోనే వస్తున్నారు. అయితే వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆడించకపోవడం పీసీబీ చేసిన తప్పు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ప్రతీసారి బాబర్-రిజ్వాన్ ఆడుతారని చెప్పలేం. ఇప్పుడు నడుస్తోంది కూడా అదే. వాస్తవానికి పాక్ జట్టులో ఫఖర్ జమాన్ రెగ్యులర్‌గా మూడో స్థానంలో వస్తుంటాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఎంపిక చేయడం.. అతను అంచనాలకు మించి రాణిస్తుండడం కలిసొచ్చే అంశం.
అయితే ఫఖర్ జమాన్‌ను ఓపెనింగ్ స్లాట్‌లో ఆడించాల్సింది అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు టీమిండియాలో రోహిత్-రాహుల్ జోడి విఫలమయినా.. వారికి ప్రత్యామ్నాయంగా చాలా మంది అందుబాటులో ఉన్నారు. కానీ పాకిస్తాన్‌కు ఆ చాన్స్ లేకుండా పోయింది. అందుకే బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడిని విడదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఓపెనింగ్ జోడిలో ఒకరి స్థానంలో వేరొకరిని ఆడించడం మంచిదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment