ENG Vs IND: రెండో విజయమే లక్ష్యంగా కోహ్లి సేన | ENG Vs IND: Team India Is Full Confidence Going To Win Leads 3rd Test | Sakshi
Sakshi News home page

ENG Vs IND: రెండో విజయమే లక్ష్యంగా కోహ్లి సేన

Published Wed, Aug 25 2021 7:25 AM | Last Updated on Wed, Aug 25 2021 8:27 AM

ENG Vs IND: Team India Is Full Confidence Going To Win Leads 3rd Test - Sakshi

నాటింగ్‌హామ్, లార్డ్స్‌... ఈ రెండు వేదికల్లో భారత జట్టే పైచేయి సాధించింది. ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో వర్షం గట్టెక్కించినా... రెండో టెస్టులో పరాజయం తప్పలేదు. ముఖ్యంగా భారత పేస్‌ దళం పదునెక్కి ఉంది. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు వారిసొంత గడ్డపైనే చుక్కలు చూపిస్తోంది. గత టెస్టులో ఆఖరి రోజు అయితే కనీసం 60 ఓవర్లు ఆడనీయలేదు. బ్యాటింగ్‌లో కొంత మెరుగవ్వాల్సివున్నా... బెంగలేదు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

లీడ్స్‌: ఇంగ్లండ్‌ గడ్డపై భారత జట్టు ఒక సిరీస్‌లో ఒకే ఒక సారి మాత్రమే రెండు మ్యాచ్‌లు గెలవగలిగింది. ఇప్పుడు దానిని పునరావృతం చేసే అవకాశం జట్టు ముందుంది.  ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్‌ ఈ మూడో టెస్టు గెలిస్తే చాలు సిరీస్‌ చేజారిపోయే పరిస్థితే రాదు. గత రెండు టెస్టుల్లో ఆధిపత్యం దృష్ట్యా కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరుతో మరో విజయంపై భారత్‌ కన్నేసింది. మరో వైపు ఇంగ్లండ్‌ సొంతగడ్డపైనే సిరీస్‌ ఆడుతున్నా జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ఓపెనింగ్‌ సమస్య, పేసర్ల గాయాలు, నిలకడ లేని బ్యాటింగ్‌ రూట్‌ సేనకు ప్రతికూలంగా మారింది. ఇప్పుడైతే ఈ సిరీస్‌లో నిలబడాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఇలాంటి ఒత్తిడిలో జోరు మీదున్న భారత్‌ను ఐదురోజుల పాటు ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.  

ఎదురులేని టీమిండియా 
ఆడుతోంది ఇంగ్లండ్‌లో అయినా... భారత్‌ ఆటతీరు సొంతగడ్డను తలపిస్తోంది. బహుశా ఎదురే లేని ఈ ప్రదర్శన వల్లేనేమో కోహ్లి జట్టులో మార్పులకు సిద్ధంగా లేడు. ఓపెనింగ్‌లో రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ బాగానే ఆడుతున్నప్పటికీ భారత సారథి కోహ్లి బ్యాట్‌ నుంచి భారీ స్కోరు రావాల్సివుంది. వైస్‌ కెపె్టన్‌ రహానే కూడా గత మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు కోహ్లి కూడా భారత స్కోరుకు బ్యాట్‌తో జోరు అందిస్తే ప్రత్యర్థి బౌలర్లకు  ఇబ్బందులు తప్పవు. పుజారా, రిషభ్‌ పంత్‌లలో చెప్పుకోదగ్గ వైఫల్యాలైతే లేవు. సీమర్లు షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పాలిట సింహస్వప్నాలయ్యారు. పేసర్లపైనే నమ్మకం పెట్టుకోవడంతో సీనియర్‌ స్పిన్నర్‌ అశి్వన్‌ ఈ టెస్టులో కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.  

ఇంగ్లండ్‌ తడబాటు 
మరోవైపు ఇంగ్లండ్‌ వరుస వైఫల్యాలతో తడబడుతోంది. ఓపెనింగ్‌ జోడీ నిరాశ పరచడంతో బర్న్స్‌కు జతగా హసీబ్‌ను దింపుతోంది. డేవిడ్‌ మలాన్‌కు అవకాశమిచ్చింది. టాపార్డర్‌ మార్పులతోనైనా పరుగులబాట పట్టాలని ఆశిస్తోంది. బట్లర్, బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీలు కూడా బ్యాటిం గ్‌ భారాన్ని మోస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. పసలేని బౌలింగ్‌ రూట్‌ సేనకు కష్టాలను తెచి్చపెడుతోంది. గత టెస్టులో షమీ, బుమ్రా బ్యాటింగ్‌లో అజేయంగా నిలబడిన తీరు వారి బౌలింగ్‌ లోపాల్ని ఎత్తిచూపుతోంది. అనుభవజు్ఞడైన అండర్సన్, రాబిన్సన్‌ తమ శక్తి మేరా రాణిస్తేనే పటిష్టమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఢీకొంటుంది. లేదంటే గత మ్యాచ్‌ చేదు ఫలితం తప్పకపోవచ్చు.  

పిచ్‌–వాతావరణం 
ఇంగ్లండ్‌ పిచ్‌లన్నీ సీమర్‌ ఫ్రెండ్లీ వికెట్లే! అయితే ఇక్కడ మాత్రం పూర్తిగా పేస్‌కే కాకుండా స్పిన్నర్లకు అవకాశం ఉండొచ్చు. లీడ్స్‌లో వర్షం ముప్పులేదు. దీంతో మ్యాచ్‌ ఐదు రోజులు అంతరాయాలు లేకుండా సాఫీగా సాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement