లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ మలాన్ (114 బంతుల్లో 127; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్ ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.
బెయిర్‌స్టో 13, రూట్ 29, హ్యారీ బ్రూక్ 10, జోస్ బట్లర్ 36, లివింగ్‌స్టోన్ 28, మొయిన్ అలీ 3, సామ్ కర్రన్ 20, డేవిడ్ విల్లే 19, బ్రైడన్ కార్స్ 15 నాటౌట్, రీస్ టాప్లే 1 నాటౌట్ పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో విజృంభించగా.. డారిల్ మిచెల్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు, జేమీసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గత మ్యాచ్ భారీ శతకంతో విరుచుకుపడిన బెన్ స్టోక్స్, ఐదు వికెట్లతో చెలరేగిన ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో లేరు.
అనంతరం 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 7 పరుగులు చేసి రనౌట్ కాగా.. విల్ యంగ్ (15), హెన్రీ నికోల్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్లో తొలి వన్డేలో న్యూజిలాండ్, రెండు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే (3-1) సిరీస్ వారి వశమే అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం అవుతుంది. ఇదే పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment