హైదరాబాద్: ప్రొఫెషనల్ ఆన్‌లైన్ గేమింగ్ ఆడాలనుకునే వారికి సరికొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్(ఈఎస్‌పీఎల్) పేరిట అభిమానులను అలరించేందుకు ఈ-ప్లాట్‌ఫామ్ సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలో దేశంలోని ఎనిమిది నగరాలు ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈఎస్‌పీఎల్‌లో పాల్గొంటాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ పేరిట ఓ జట్టు లాంచ్ అయ్యింది. ఈ జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రచారకర్తగా ఉన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ యజమానులు హైదరాబాద్ హైద్రాస్ జట్టును తీసుకొచ్చారు.
ఆన్‌లైన్ గేమింగ్‌పై యువతకు ఉన్న ఆకర్షనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ హైద్రాస్ పని చేస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం పేర్కొంది. కాగా, ఈఎస్‌పీఎల్ తొలి సీజన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంట్రీల కోసం ఆహ్వానాలు పంపగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే పరిశీలన అనంతరం 96 జట్లను ఫైనల్ చేయగా, అందులో నుంచి ఎనిమిది జట్లు మాత్రమే తుది దశకు అర్హత సాధించాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ ఒకటి. నిన్న మొదలైన ఈఎస్‌పీఎల్ తొలి సీజన్ దాదాపు రెండున్నర నెలల పాటు వర్చువల్ విధానంలో సాగనుంది.
ఇందుకు ప్రైజ్‌మనీని రూ.25 లక్షలుగా ఖరారు చేయగా, విజేతకు రూ.12 లక్షలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లకు వరుసగా రూ.6 లక్షలు, రూ.3 లక్షల నగదు ప్రోత్సాహం లభించనుంది. ఈఎస్‌పీఎల్‌లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు www.indiatodaygaming.com/espl లో రిజిస్టర్ కావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈఎస్‌పీఎల్‌లో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. కరోనా వైరస్ దృష్ట్యా వర్చువల్ రీతిలో జరిగే మ్యాచ్‌లన్నీ డిస్నీ హాట్‌స్టార్‌తో పాటు ఇండియాటుడేకు చెందిన అధికారిక యూట్యూబ్, ఫేస్‌బుక్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే
Comments
Please login to add a commentAdd a comment