Fans erupt after Selectors ignore Rinku Singh in Team India T20 squad for West Indies Tour - Sakshi
Sakshi News home page

విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రింకూ సింగ్‌ ఏడి..?

Published Thu, Jul 6 2023 7:43 AM | Last Updated on Thu, Jul 6 2023 8:39 AM

Fans Ask Rinku Singh Involvement In Team India T20 Squad For Windies Tour - Sakshi

ఐపీఎల్‌ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే మీడియా కథనాలను కాని, రింకూ సింగ్‌ ప్రదర్శనను కాని పరిగణలోకి తీసుకోని భారత సెలెక్షన్‌​ కమిటీ అతనికి మొండిచేయి చూపించింది. అతని స్థానంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ కోటాలో తిలక్‌ వర్మకు చోటు కల్పించింది. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌గా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. ఐపీఎల్‌లో రింకూతో సరిసాటిగా రాణించిన యశస్వి జైస్వాల్‌ని కూడా ఎంపిక చేసింది.

యువకులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఊదరగొట్టే భారత సెలెక్టర్లు, సీనియర్ల గైర్హాజరీలోనూ రింకూ సింగ్‌ లాంటి టాలెంటెడ్‌ ఆటగాడికి చోటు కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రింకూను.. మరో సంజూ శాంసన్‌లా (అవకాశాలు ఇవ్వకుండా) తయారు చేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదంటూ సెలెక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు.

పాపం​ రింకూ.. అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతి చూపిస్తున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడం టీమిండియాకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు భారత క్రికెట్‌లో ఇది సర్వసాధారణమని.. సెలెక్టర్లు టాలెంటెడ్‌ యువతకు అవకాశాలు ఇస్తే ఆశ్చర్యపోవాలి కాని, ఇలా జరిగితే పెద్ద విశేషమేమి కాదంటున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడంపై అతని ఐపీఎల్‌ జట్టు కేకేఆర్‌ కూడా స్పందించింది.

రింకూ స్లిప్‌లో క్యాచ్‌ పడుతున్న ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. నథింగ్‌ స్లిప్పింగ్‌ థ్రూ అంటూ కామెంట్‌ చేసింది. కాగా, 25 ఏళ్ల రింకూ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రింకూ 14 మ్యాచ్‌లు ఆడి 59.25 సగటున 149.53 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ ఆడిన ఇన్నింగ్స్‌ (యశ్‌ దయాల్‌వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు) సగటు క్రికెట్‌ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు.

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement