
FIFA World Cup 2022: France Qualified For Tourney After Beat Kazakhstan: వచ్చే ఏడాది ఖతర్‌లో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ బెల్జియం, 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. కజకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 8–0తో ఘనవిజయం సాధించింది.
ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె ఏకంగా నాలుగు గోల్స్ చేయగా... కరీమ్ బెంజెమా రెండు గోల్స్... రాబియోట్, గ్రీజ్‌మన్ ఒక్కో గోల్ సాధించారు. గ్రూప్ ‘డి’లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఫ్రాన్స్ నాలుగు విజయాలు, మూడు ‘డ్రా’లతో 15 పాయింట్లు సాధించి గ్రూప్ విజేత హోదాలో ప్రపంచకప్‌కు అర్హత పొందింది. గ్రూప్ ‘ఇ’లో ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–1తో నెగ్గింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన బెల్జియం 19 పాయింట్లతో గ్రూప్ ‘ఇ’ విజేతగా అర్హత పొందింది.
గ్రూప్ ‘హెచ్’లో క్రొయేషియా 23 పాయింట్లతో టాపర్‌గా నిలిచి బెర్త్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 1–0తో రష్యాను ఓడించింది. రష్యా ప్లేయర్ కుద్రయెశోవ్ 81వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేసి క్రొయేషియాను గెలిపించాడు. 32 జట్లు పాల్గొనే 2022–ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటివరకు ఆతిథ్య ఖతర్ జట్టుతోపాటు జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్, క్రొయేషియా అర్హత పొందాయి.