గంభీర్‌ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్‌ కోచ్‌ | Gambhir Love For 8 Batters: India Assistant Coach Doeschate Explains Strategy To Send Dhruv Jurel To Bat At 8 In T20I | Sakshi
Sakshi News home page

గంభీర్‌ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్‌ కోచ్‌

Published Fri, Jan 31 2025 1:46 PM | Last Updated on Fri, Jan 31 2025 3:04 PM

Gambhir Love For 8 Batters: Assistant coach Doeschate Explains T20I strategy

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ మొదలుకాగా..  ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదంటూ
కోల్‌కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్‌పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.

స్పెషలిస్టు బ్యాటర్‌ అయిన ధ్రువ్‌ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసమని ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌- అక్షర్‌ పటేల్‌లను ముందుగా బ్యాటింగ్‌కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో జురెల్‌ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌ 6, అక్షర్‌ పటేల్‌ 15 పరుగులు చేశారు.

మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు వచ్చాయి.

 మా వ్యూహాల్లో భాగమే..
ఈ క్రమంలో అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్‌ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో గౌతం గంభీర్‌ బ్లూప్రింట్‌ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.

ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్‌ చేస్తాడు. ఇక ధ్రువ్‌ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్‌ ఆర్డర్‌లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.

వీలైనన్ని అవకాశాలు ఇస్తాం
ఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. 

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌లను ఆడించాలని సూచించాడు. 

చదవండి: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement