‘‘ఒక ఆటగాడు పూర్తి ఫిట్‌గా ఉంటే మూడు ఫార్మాట్లు తప్పక ఆడాలని నేను విశ్వసిస్తాను. గాయాల బెడద వెంటాడుతుందనే భయంతో ఆటకు దూరంగా ఉండటం నాకు నచ్చదు.
గాయపడితే ఏమవుతుంది? తిరిగి కోలుకుంటారు కదా! అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టాప్ క్రికెటర్లలో ఎవరిని అడిగినా మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నామనే చెబుతారు.
రెడ్ బాల్ బౌలర్లు లేదంటే వైట్ బాల్ బౌలర్లు అని ముద్ర వేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. గాయాలన్నవి ఆటగాళ్ల జీవితంలో భాగం. అంతేగానీ వాటి కారణంగా ఏదో ఒక ఫార్మాట్‌కే పరిమితం కావడం సరికాదు. ఒకవేళ గాయపడ్డా.. పట్టుదలతో కోలుకుని తిరిగి రావడం పెద్ద కష్టమేమీ కాదు.
కొంతమందికి విశ్రాంతినిస్తూ ప్రత్యేకంగా చూడటం పట్ల నాకు సదభిప్రాయం లేదు. గాయాలు, పని ఒత్తిడి అంటూ ఆటకు దూరంగా ఉండకూడదు. నిజానికి ప్రొఫెషనల్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ వ్యవధి చాలా తక్కువ. అలాంటపుడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భావించాలే గానీ.. తప్పుకోకూడదు.
ఏ ఆటగాడైనా ఫామ్‌లో ఉంటే.. మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు సాగాలి. నేనైతే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఫలితాల గురించి పట్టించుకోవడం మానేశాను.
వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. విలువలతో, క్రీడాస్ఫూర్తితో ఆడితే అంతా సజావుగానే సాగిపోతుందని నమ్ముతాను. మనం నిజాయితీగా ఉన్నంత కాలం ప్రపంచం మొత్తం మనల్ని వ్యతిరేకించినా ఏమీ కాదు. జట్టు ప్రయోజనాలు మాత్రమే అంతిమ లక్ష్యంగా ఉండాలి.
నేను క్రికెట్ మైదానంలో దూకుడుగానే ఉండేవాడిని. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో వాదనకు దిగాల్సి వచ్చేది. అదంతా కేవలం జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే.
వ్యక్తిగత విజయాలకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు. జట్టే ముందు.. ఆ తర్వాతే మనం. అలాంటపుడే సమష్టిగా రాణించి గెలుపొందగలం. ఇది జట్టుగా ఆడే ఆట కాబట్టి.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు.
ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాలని పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యే కంటే ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఈ మేరకు గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవలంబించబోయే విధానాల గురించి ముందుగానే ఇలా సంకేతాలు ఇచ్చాడు. కాగా గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
గాయాల భయంతో హార్దిక్ ఎన్నో ఏళ్లుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు కేవలం వన్డే, టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు.
మరోవైపు.. గంభీర్ వచ్చే కంటే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్?
Comments
Please login to add a commentAdd a comment