గంభీర్ చేతిలో అంతుచిక్క‌ని ప‌దార్థం.. ట్రోల్‌ సరికాదు! | Gambhir-Seen-Consuming Mysterious Product In-Dressing Room Viral | Sakshi
Sakshi News home page

IND Vs AFG: గంభీర్ చేతిలో అంతుచిక్క‌ని ప‌దార్థం.. ట్రోల్‌ సరికాదు!

Jun 6 2026 5:02 PM | Updated on Jun 6 2026 6:18 PM

Gambhir-Seen-Consuming Mysterious Product In-Dressing Room Viral

ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా అడుగులేస్తోంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ శ‌త‌కంతో చెల‌రేగిత్‌, కెప్టెన్ గిల్ కూడా సెంచ‌రీ దిశ‌గా ప‌రిగెడుతున్నాడు. సాయి సుద‌ర్శ‌న్ కూడా హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో త‌న చేతిలో ఒక అంతుచిక్క‌ని ప‌దార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. 

అయితే అవి హోమియోప‌తి మెడిసిన్స్ అయ్యే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే చిన్న డ‌బ్బాలో రౌండ్‌గా ఉన్న పిల్స్‌ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవ‌డం క‌నిపించింది. బ‌హుశా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కార‌ణంగా గంభీర్ ఆ పిల్స్‌ను వాడుతున్న‌ట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

అయితే అవ‌కాశం చిక్కితే చాలు గంభీర్‌ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకునే కొంద‌రు ఆక‌తాయిలు త‌మ నోటికి ప‌నిచెప్పారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అడ్డ‌దిడ్డంగా పోస్టులు పెట్ట‌డం క‌నిపించింది. 'గంభీర్ డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడని, వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కొంద‌రు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావ‌రణాన్ని గంభీర్ పూర్తిగా చెడ‌గొడుతున్నాడ‌ని, అత‌న్ని వెంట‌నే కోచ్ ప‌ద‌వి నుంచి బ‌ర్త్‌ర‌ఫ్ చేయాల‌ని' కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఆఫ్గ‌న్‌తో టెస్టు ద్వారా సంప్ర‌దాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాయి సుద‌ర్శ‌న్ ఆక‌ట్టుకున్నాడు. గంభీర్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్‌లో సాయి సుద‌ర్శ‌న్ 104 బంతులెదుర్కొని 13 బౌండ‌రీల సాయంతో 81 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాల‌ని గంభీర్ త‌న‌కు చెప్పాడ‌ని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. 

జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా 85 ఓవ‌ర్ల‌లో  3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంత‌క‌ముందు కేఎల్ రాహుల్ (100) శ‌త‌కం సాధించాడు. 

చదవండి: ఆఫ్గన్‌తో టెస్టు.. గిల్‌ అరుదైన ఫీట్‌!

Advertisement
 
Advertisement
Advertisement