
గుజరాత్ టైటాన్స్ (Photo Courtesy: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడి పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయం అందుకోగా.. గుజరాత్ సారథిగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.
శ్రేయస్ అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండు పాత్రల్లోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గిల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలే ఓటమికి పరోక్ష కారణాలంటూ విమర్శించాడు.
పవర్ ప్లేలో బౌలర్ల మార్పులు
ముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో గుజరాత్ సారథి విఫలమయ్యాడని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగినట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుగ్గా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడులే అనుకునే సరికి.. అర్షద్ ఖాన్‌ను తీసుకువచ్చాడు.
ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?
అతడేమో పవర్ ప్లేలోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడనుకుంటా! అదే పంజాబ్‌కు మొమెంటమ్‌ను ఇచ్చింది. ఒకవేళ సిరాజ్ గనుక కొత్త బంతితో రాణిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఆఖర్లోనూ సిరాజ్ బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలని.. కానీ శుబ్‌మన్ గిల్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఓ బౌలర్ మెరుగ్గా రాణిస్తున్న వేళ.. అతడిని తప్పించి మరొకరిని తీసుకురావడం సరికాదని పేర్కొన్నాడు. గిల్ ఇకనైనా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులలో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేదంటే మున్ముందు గుజరాత్‌కు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.
సిరాజ్ ధారాళంగా
కాగా గుజరాత్ టైటాన్స్ తమ సొంతమైదానం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం మ్యాచ్ ఆడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన టీమిండియా పేసర్ సిరాజ్.. తొలి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు.
మరుసటి ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడను గిల్ బరిలోకి దించగా.. అతడు 8 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సిరాజ్ రంగంలోకి దిగి.. 12 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రబడ ఓవర్లో తొలి వికెట్ దక్కించుకుంది టైటాన్స్.
అయితే, వీరిద్దరిని పక్కనపెట్టిన గిల్.. ఐదో ఓవర్లో అర్షద్ ఖాన్‌ను తీసుకురాగా.. అతడు ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మళ్లీ పదిహేనో ఓవర్ దాకా గిల్ సిరాజ్ చేతికి బంతినివ్వలేదు. మళ్లీ ఆఖరి ఓవర్లో సిరాజ్‌ను రంగంలోకి దించగా.. ఈసారి ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
శ్రేయస్ ధనాధన్
ఈ నేపథ్యంలో సెహ్వాగ్ గిల్ కెప్టెన్సీ తీరుపై పైవిధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అరంగేట్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 47) మెరుపులు మెరిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక మార్కస్ స్టొయినిస్ (15 బంతుల్లో 20) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపులు(16 బంతుల్లోనే 44 నాటౌట్) మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు నమోదు చేసింది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్.. ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.
టైటాన్స్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54) అర్ధ శతకాలతో రాణించగా.. శుబ్‌మన్ గిల్(14 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(28 బంతుల్లో 46) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 232 పరుగులకే పరిమితమైన టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.
చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్
Punjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️
Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025