
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
మన్యాల ప్రణీత్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ షేక్ రషీద్ (20; 4 ఫోర్లు), మద్దిల హర్షవర్ధన్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), మిట్టా లేఖజ్ రెడ్డి (26; 5 ఫోర్లు), పాథూరి మనోహర్ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు, సాయితేజ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ మున్నంగి అభినవ్ (57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోస్టల్ జట్టు బౌలర్లలో చీపురపల్లి స్టీఫెన్, సుదర్శన్, ఆశిష్, మనోహర్ రెండు వికెట్ల చొప్పున తీసి బెజవాడ జట్టును దెబ్బ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment