ICC WC 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2011 సమయంలో తాను సెలక్టర్ లేదంటే కెప్టెన్ అయి ఉంటే.. రోహిత్‌ను తప్పక జట్టుకు ఎంపిక చేసేవాడినని పేర్కొన్నాడు.
అయితే, నాడు రోహిత్ శర్మ ఇలా లేడన్న వీరూ భాయ్.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అప్పటి కెప్టెన్, సెలక్టర్లు నిర్ణయం తీసుకుని ఉంటారని పేర్కొన్నాడు. బహుశా అప్పుడలా జట్టులో చోటు దక్కకపోవడం వల్లే హిట్‌మ్యాన్‌కు మేలు జరిగిందని అభిప్రాయపడ్డాడు.
రోహిత్‌ను వద్దని అతడి వైపు మొగ్గు
కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో సొంతగడ్డ మీద టీమిండియా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. నాటి జట్టులో భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా విరాట్ కోహ్లి వంటి యువకులకు చోటు దక్కింది.
అయితే, రోహిత్ శర్మకు మాత్రం మొండిచేయి ఎదురైంది. జట్టు సమతూకం కోసం స్పిన్నర్ పీయూష్ చావ్లా వైపు మొగ్గుచూపాడు ధోని. దీంతో ఈ ముంబై బ్యాటర్ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో నాడు స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై టీమిండియా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగడం విశేషం.
సెంచరీతో రికార్డులు బద్దలు
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(7) చేసిన ఆటగాడిగా నిలిచి.. సచిన్ టెండూల్కర్ (6) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) 556 సిక్సర్లు బాదిన రోహిత్.. క్రిస్‌గేల్ (553) రికార్డు అధిగమించాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లోనే సెంచరీ చేసి.. వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.
నేనైతే రోహిత్‌ను సెలక్ట్ చేసేవాడిని.. కానీ
ఈ మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నేను కెప్టెన్ లేదంటే సెలక్టర్ అయి ఉంటే రోహిత్‌ను తప్పకుండా జట్టుకు ఎంపిక చేసేవాడిని. అయితే, అప్పుడు రోహిత్ ఇప్పటిలా లేడు. ఏదేమైనా జట్టును సమతూకంగా ఉంచేందుకు నాడు కెప్టెన్(ధోని) ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆరోజు జట్టులో చోటు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన రోహిత్.. రియలైజ్ అయి తనను తాను మార్చుకున్నాడు.
నిలకడైన ఆటతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మరి ఈసారి వరల్డ్‌కప్‌లో వచ్చిన ఛాన్స్‌ను ఎలా మిస్ చేసుకుంటాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. 2011లో యూసఫ్ పఠాన్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన కారణంగా రోహిత్ శర్మను కాదని అదృష్టం అతడిని వరించిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: WC: అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్! కోహ్లి చర్య వైరల్.. గంభీర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment