
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ గాదె హనుమ విహారి వచ్చే దేశవాళీ సీజన్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాలనుకున్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. తన సొంత జట్టు ఆంధ్ర తరఫునే కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యుల విజ్ఞప్తి మేరకు విహారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత సీజన్‌లో విహారి నాయకత్వంలోనే ఆంధ్ర రంజీ ట్రోఫీ నాకౌట్ దశకు చేరగా...బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన అతను 14 ఇన్నింగ్స్‌లలో 2 హాఫ్ సెంచరీలతో 490 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కుడి చేతికి తీవ్ర గాయం కాగా, జట్టును ఓటమినుంచి రక్షించేందుకు అతను ఎడమచేత్తో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. భారత్ తరఫున చివరిసారిగా ఏడాది క్రితం బర్మింగ్‌హోం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో విహారి బరిలోకి దిగాడు.
చదవండి: ODI World Cup 2023: ప్లీజ్ స్టోక్స్ వచ్చేయ్.. ప్రపంచకప్‌లో ఆడు!