టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు కాకుండా వేరొకరికి పగ్గాలు అప్పజెప్పడం సరికాదని పేర్కొన్నాడు.
కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడు ఎవరా అన్న అంశంపై చర్చలు జరిగాయి. భారత టీ20 కెప్టెన్‌గా.. ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నియామకం లాంఛనమే అని అభిమానులు భావించారు.
ఆటగాడిగా మాత్రమే హార్దిక్ పాండ్యా
అయితే, అనూహ్యంగా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంకతో సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అతడిని కెప్టెన్‌గా ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. హార్దిక్ పాండ్యాకు జట్టులో ఆటగాడిగా మాత్రమే చోటిచ్చింది.
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ నియామకం విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తారని భావించాను.
ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలపడంతో పాటు.. మరోసారి కూడా ఫైనల్ చేర్చాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
అంతేకాదు టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ కూడా అతడే! అయితే, ఇప్పుడు కొత్త కోచ్ వచ్చాడు. కాబట్టి తన ప్రణాళికలకు అనుగుణంగా అంతా ఉండాలని అనుకుంటున్నాడేమో!
అతడి విషయం నాకు తెలియదు కానీ.. హార్దిక్‌ను పక్కనపెట్టడం సరికాదు. ఐపీఎల్‌లో టైటాన్స్‌ను జీరో నుంచి హీరోను చేసిన ఘనత హార్దిక్‌దే.
నిజానికి సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్‌గానూ రాణించాలని కోరుకుంటున్నాను. అయితే, హార్దిక్ పాండ్యా సారథిగా ఉంటే బాగుండేది.
తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడు?
కోచ్‌గా గంభీర్ తన నిర్ణయాలు అమలు చేయాలనుకోవచ్చు. కానీ హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ కాకుండా తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడో అర్థం కావడం లేదు’’ అని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టును విజయపథంలో నిలపలేకపోయాడున. అదే విధంగా తరచూ గాయాల బారిన పడే హార్దిక్ లాంటి ఆటగాళ్లు తనకు కెప్టెన్లుగా వద్దని కొత్త కోచ్ గౌతం గంభీర్ చెప్పినట్లు సమాచారం.
అదే విధంగా.. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సూర్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ హార్దిక్‌కు బదులు సూర్యను కెప్టెన్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. టీ20 సిరీస్‌తో ఈ టూర్ మొదలుకానుంది.
చదవండి: నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment