తిలక్ వర్మతో సూర్యకుమార్ యాదవ్
West Indies vs India, 3rd T20I- Suryakumar Yadav Comments: ‘‘పవర్ ప్లేలోనే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నా నుంచి మేనేజ్‌మెంట్ ఏం ఆశిస్తుందో నాకు తెలుసు. కాబట్టి పని పూర్తి చేయాలని భావించా. తిలక్, నేను మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాం.
మా బ్యాటింగ్ ఎలా సాగుతుందో పరస్పర అవగాహన ఉంది. సమన్వయంతో ముందుకు సాగిపోయాం. ఇద్దరం మెరుగ్గా బ్యాటింగ్ చేస్తూ ఉండటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తిలక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో దంచికొడుతూ నాకు మద్దతుగా నిలిచాడు.
నా మెదడును తొలిచేసింది
నిజానికి.. ఇప్పటి వరకు టీమిండియా వరుసగా మూడు టీ20లలో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇదే విషయం నా మెదడును తొలిచివేస్తూ ఉంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. జట్టుతో సమావేశమైన సమయంలో మా కెప్టెన్ అందరికీ గట్టిగానే చెప్పాడు.
ఎవరో ఒక్కరు అదరగొట్టినా మ్యాచ్ గెలుస్తామన్నాడు. ఆ ఒక్కడిని నేనే కావడం సంతోషంగా ఉంది’’ అని టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో విజయం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.
విండీస్‌ను కట్టడి చేసి
కాగా కరేబియన్ దీవి పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో మ్యాచ్ జరిగింది.
గయానా మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. యువ పేసర్ ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆకాశమే హద్దుగా సూర్య.. అండగా తిలక్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్(1), శుబ్‌మన్ గిల్(6)ల పేలవ ప్రదర్శనతో ఆదిలోనే షాక్ తగిలింది. ఈ క్రమంలో పవర్ ప్లేలో బ్యాటింగ్‌కు దిగిన వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
హార్దిక్ సిక్సర్‌తో..
44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా యువ సంచలనం తిలక్ వర్మ 49(నాటౌట్) రాణించాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో సూర్య బ్రాండ్‌నకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ 15 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. పద్దెనిమిదో ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.
దీంతో టీ20లో హ్యాట్రిక్ ఓటముల గండం నుంచి టీమిండియా తప్పించుకుంది. తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నంబర్1 టీ20 స్టార్ సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో విజయంపై స్పందిస్తూ కెప్టెన్ మాటలు గుర్తుచేసుకున్న ‘స్కై’ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది?
గంభీర్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. అరుదైన ఘనత.. నంబర్ 1తో!
Form is temporary. Surya is permanent!
— FanCode (@FanCode) August 8, 2023
.#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ
Comments
Please login to add a commentAdd a comment