
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ వివరణ ఇచ్చారు. హెచ్‌సీఏ సీనియర్ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రమే నిర్వహించనున్నారు. ‘అజహర్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి.
ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్‌ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్ వ్యాఖ్యానించారు. కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. ‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్‌సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారు.