కోల్‌కతా: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 23 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 100 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో తొలి సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ మార్క్‌రమ్ (26 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ నితీశ్ రాణా (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), రింకూ సింగ్ (31 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
మెరుపు భాగస్వామ్యాలు...
ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే బ్రూక్ దూకుడు మొదలైంది. ఉమేశ్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, ఉమేశ్ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. రసెల్ ఒకే ఓవర్లో మయాంక్ (9), రాహుల్ త్రిపాఠి (9)లను అవుట్ చేసినా మరోవైపు బ్రూక్ జోరు ఆగలేదు. అతనికి జత కలిసి మార్క్‌రమ్ కూడా చెలరేగిపోయాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75/2కు చేరింది.
మరోవైపు సుయశ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్.. వరుణ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన మార్క్‌రమ్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్రూక్ పండగ చేసుకున్నాడు. తొలి బంతిని సిక్స్‌గా మలచిన అతను మరో 4 ఫోర్లు బాదాడు. అభిషేక్ కూడా మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో 18 ఓవర్లు ముగిసేసరికి రైజర్స్ స్కోరు 200 పరుగులకు చేరింది.
బ్రూక్, అభిషేక్ నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. చివరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి బ్రూక్ శతకాన్ని అందుకోగా, ఆఖర్లో క్లాసెన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సుయశ్ వదిలేయడం కూడా రైజర్స్ ఇన్నింగ్స్‌లో కీలక క్షణం. దీనిని వాడుకున్న బ్రూక్ ఆ తర్వాతి 27 బంతుల్లో మరో 55 పరుగులు చేశాడు.
ఆరంభంలోనే తడబాటు...
ఛేదనలో నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0) అవుట్ కాగా, జాన్సెన్ వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్ (10), నరైన్ (0)లను వెనక్కి పంపాడు. ఇలాంటి స్థితిలో ఉమ్రాన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ కేకేఆర్ ఇన్నింగ్స్‌కు కాస్త ఊపు తెచ్చింది. ఈ ఓవర్లో రాణా వరుస బంతుల్లో 4, 6, 4, 4, 4, 6 (మొత్తం 28 పరుగులు) బాదడం విశేషం.
అయితే తన వరుస ఓవర్లలో జగదీశన్, రసెల్ (3)లను మర్కండే అవుట్ చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాణా మాత్రం తన జోరును కొనసాగించాడు. గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ మరో ఎండ్ నుంచి కెప్టెన్‌కు సహకరించాడు. వీరిద్దరి భాగస్వామ్యం (39 బంతుల్లో 69) కొంత ఆశలు రేపినా... లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఈ ఇద్దరి ప్రయత్నం సరిపోలేదు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (నాటౌట్) 100; మయాంక్ (సి) వరుణ్ (బి) రసెల్ 9; రాహుల్ త్రిపాఠి (సి) గుర్బాజ్ (బి) రసెల్ 9; మార్క్‌రమ్ (సి) రసెల్ (బి) వరుణ్ 50; అభిõషేక్ (సి) శార్దుల్ (బి) రసెల్ 32; క్లాసెన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–46, 2–57, 3–129, 4–201. బౌలింగ్: ఉమేశ్ 3–0– 42–0, ఫెర్గూసన్ 2–0–37–0, నరైన్ 4–0–28–0, రసెల్ 2.1–0–22–3, వరుణ్ 4–0–41–1, సుయశ్ 4–0–44–0, శార్దుల్ 0.5–0–14–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్: గుర్బాజ్ (సి) ఉమ్రాన్ (బి) భువనేశ్వర్ 0; జగదీశన్ (సి) (సబ్) ఫిలిప్స్ (బి) మర్కండే 36; వెంకటేశ్ (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 10; నరైన్ (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 0; రాణా (సి) సుందర్ (బి) నటరాజన్ 75; రసెల్ (సి) జాన్సెన్ (బి) మర్కండే 3; రింకూ (నాటౌట్) 58; శార్దుల్ (సి) సుందర్ (బి) ఉమ్రాన్ 12; ఉమేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–0, 2–20, 3–20, 4–82, 5–96, 6–165, 7–197, బౌలింగ్: భువనేశ్వర్ 4–1–29–1, జాన్సెన్ 4–0–37–2, నటరాజన్ 4–0–54–1, ఉమ్రాన్ 2–0–36–1, మర్కండే 4–0–27–2, సుందర్ 2–0–20–0.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు Vs ఢిల్లీ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)
లక్నో Vs పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment