I Am An Annoying Captain: MS Dhoni Surprises Harsha Bhogle With Honest Admission - Sakshi
Sakshi News home page

#MS Dhoni: మా వాళ్లకు చుక్కలు చూపిస్తా! పాపం వాళ్ల పరిస్థితి ఊహించుకోండి! నా రియాక్షన్స్‌ కోసం కాకపోయినా..

Published Wed, May 24 2023 1:05 PM | Last Updated on Wed, May 24 2023 1:39 PM

I Am An Annoying Captain: Dhoni Surprises Harsha Bhogle With Honest Admission - Sakshi

జడేజాతో ధోని.. (PC: IPL/BCCI)

IPL 2023- CSK In Final- MS Dhoni: మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో ఆడే అవకాశం వస్తే బాగుండని ప్రతి యువ క్రికెటర్‌ కోరుకుంటాడనంలో అతిశయోక్తి లేదు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బోల్తా కొట్టించే ధోని.. తన జట్టులోని ప్రతి ఆటగాడితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సురేశ్‌ రైనా వంటి భారత ఆటగాళ్లే కాదు ఐపీఎల్‌లో భాగంగా తలా కెప్టెన్సీలో ఆడిన కెవిన్‌ పీటర్సన్‌ వంటి విదేశీ ప్లేయర్లు సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తా
ధోని మైదానంలో ఉన్నాడంటే ఇటు అభిమానులకు.. అటు ఆటగాళ్లకు మజా వస్తుందంతే! అయితే, తాను కనిపించేంత మిస్టర్‌ కూల్‌ కాదని.. ప్లేయర్లకు చుక్కలు చూపిస్తానంటున్నాడు ధోని. ఆటగాళ్లకు పదే పదే ఆదేశాలు ఇస్తూ వాళ్లను విసిగిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు.

పదోసారి ఫైనల్‌కు
ఐపీఎల్‌-2023 తొలి క్వాలిఫయర్‌లో జయభేరి మోగించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చెపాక్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ను చిత్తు చేసి తద్వారా ఐపీఎల్‌లో పదోసారి తుదిపోరుకు అర్హత సాధించింది.

ఇక ఇప్పటికే సీఎస్‌కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపి విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోని.. ఈసారి కూడా టైటిల్‌ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ అనంతరం ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో సంభాషణ సందర్భంగా ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

అలా ఎలా ధోని?
హర్షా భోగ్లే మాట్లాడుతూ.. రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే పట్టిన సంచలన క్యాచ్‌ల గురించి ప్రస్తావిస్తూ ఫీల్డ్‌ అంత బాగా ఎలా సెట్‌ చేయగలరంటూ ధోనిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్‌, పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్‌ సెట్‌ చేస్తూ ఉంటా. నిజానికి మా వాళ్లను బాగా విసిగిస్తా. ప్రతిసారి ఫీల్డర్‌ను ఒకచోటి నుంచి మరో చోటికి మారుస్తూనే ఉంటా.

పాపం వాళ్ల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి
కాబట్టి ఫీల్డర్‌ ప్రతిసారి నాపై ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి. ప్రతి రెండు మూడు బంతులకు ఓసారి.. ‘‘నువ్వు రెండు ఫీట్లు అటు జరుగు.. ఓ రెండు ఫీట్లు ఇటు జరుగు’’ అని ఫీల్డర్‌కు చెబుతూ ఉంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! విసుగురావడం సహజం కదా!

నాపై ఓ కన్నేసి ఉంచండి.. సరేనా
అయితే, నేను మాత్రం వికెట్‌, లైన్‌కు అనుగుణంగా నా మనసు చెప్పినదాని బట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. అందుకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. ఈ సందర్భంగా మా ఫీల్డర్లకు ఓ విజ్ఞప్తి.

మీరు ఎల్లప్పుడూ నాపై ఓ కన్నేసే ఉంచండి. మీరు క్యాచ్‌ డ్రాప్‌ చేస్తే నా రియాక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడటానికి మాత్రం కాదు. ఫీల్డ్‌ సెట్‌ చేసే అంశం గురించి మాత్రమే’’ అని ధోని వ్యాఖ్యానించాడు. కాగా ధోని మే 28 నాటి ఫైనల్లో క్వాలిఫయర్‌-2 విజేతతో ఫైనల్లో తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌- ముంబై ఇండియన్స్‌ మధ్య బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. 

చదవండి: ఫైనల్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?
గుజరాత్‌, లక్నో కాదు.. చెన్నైతో ఫైనల్లో ఆడేది ఆ జట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement