IPL 2025: గుడ్‌ బై.. స్వింగ్‌ కింగ్‌ భావోద్వేగం!.. ఆరెంజ్‌ ఆర్మీపై భువీ పోస్ట్‌ | Bhuvneshwar Kumar Emotional Farewell To SRH After 11 Incredible Years, Shares Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

IPL 2025: గుడ్‌ బై.. స్వింగ్‌ కింగ్‌ భావోద్వేగం!.. ఆరెంజ్‌ ఆర్మీపై భువీ పోస్ట్‌ వైరల్‌

Published Thu, Nov 28 2024 1:40 PM | Last Updated on Thu, Nov 28 2024 2:01 PM

I Say goodbye: Bhuvneshwar Farewell to SRH After 11 incredible Years Post Viral

సన్‌రైజర్స్‌తో భువీ (PC: BCCI/IPL)

టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వకుమార్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్‌ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

కరగని కావ్య మనసు!
కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2025కి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్‌లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్‌ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.

భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నో
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్‌ కుమార్‌ కోసం సన్‌రైజర్స్‌ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. 

రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతం
ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.

సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలవడంలో భువీది కీలక పాత్ర
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 2011లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్‌రైజర్స్‌తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. 

ఆ తర్వాతి సీజన్‌లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్‌రైజర్స్‌ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్‌బ్రేక్‌ అయిందని ఆరెంజ్‌ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్‌ చేసింది.

గుడ్‌ బై.. ఆరెంజ్‌ ఆర్మీ
ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కుమార్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా ఆరెంజ్‌ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్‌ చేశాడు. ‘‘ఎస్‌ఆర్‌హెచ్‌తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. 

అయితే, మీ ప్రేమను మాత్రం మిస్‌ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్‌ కింగ్‌ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.

చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్‌ కూడా చీప్‌.. అయినా ఎందుకిలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement