న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కఠిన పరీక్ష లాంటిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కరోనా విరామం అనంతరం జరుగుతోన్న అతిపెద్ద, సుదీర్ఘ క్రికెట్ టోర్నీ ఇదే అవ్వడం, అందులోనూ ‘బయో సెక్యూర్ బబుల్’ దాటి వెళ్లకుండా అన్ని రోజుల పాటు ఉండటం క్రికెటర్లకు సవాల్ లాంటిదే అని ఆయన పేర్కొన్నాడు. ఇక్కడ వీరు కుదురుకోగలిగితే... ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆటగాళ్లు పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదని చాపెల్ వ్యాఖ్యానించాడు. ‘మనసుంటే మార్గముంటుంది.
అత్యుత్తమ ప్లేయర్లు ఊరికే ఉండరు. సవాళ్ల నుంచి సమాధానాలను సాధిస్తారు. మనం ప్రస్తుతం కరోనా కాలంలో ఉన్నాం. బయో సెక్యూర్ బబుల్స్, ఐసోలేషన్ నిబంధనలు, భౌతిక దూరం అంటూ క్రికెట్‌లో సరికొత్త మార్పులను చూస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాళ్లు వీటికి అలవాటు పడాలి’ అని చాపెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించాల్సి ఉండటంతో... ఇటువంటి పరిస్థితులకు భారత క్రికెటర్లు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిదని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. అందులో భారత్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లను ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment