మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్–2021 ఫైనల్ నవంబర్ 14న జరిగింది. క్యాలెండర్‌లో సంవత్సరం కూడా పూర్తి కాకుండానే మరోసారి ధనాధన్ ఆటలో విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్లు, కొత్త చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న జట్లన్నీ మరోసారి సత్తా చాటేందుకు బరిలోకి దిగబోతున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లను రెండు సార్లు దిగ్విజయంగా నిర్వహించిన ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన ఐసీసీ నిబంధనలతో మెగా ఈవెంట్ మరింత ఆసక్తికరంగా మారనుంది. తొలి రౌండ్‌లో 8 జట్ల మధ్య జరిగే 12 మ్యాచ్‌ల పోరు తర్వాత 12 జట్ల రెండో దశ సమరంతో మొదలు పెట్టి మరో 33 మ్యాచ్‌లు ఆసాంతం వినోదాన్ని పంచడం ఖాయం. మొత్తంగా 29 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పరుగుల పండగే.
ఏడాది వ్యవధిలోనే...
ఐసీసీ లెక్కల ప్రకారం 2010 నుంచి ప్రతీ రెండేళ్లకు ఒకసారి టి20 వరల్డ్ కప్ జరగాలి. అయితే 2016 తర్వాత ఏకంగా ఐదేళ్ల విరామం వచ్చింది. 2018లో పెద్ద సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఖరారు కావడంతో టోర్నీ సాధ్యం కాలేదు. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిపేందుకు ప్రయత్నించినా... ‘నల్లజాతీయుల రిజర్వేషన్’ సమస్యలతో అక్కడి ప్రభుత్వం అదే సమయంలో దక్షిణాఫ్రికా బోర్డుపై నిషేధం విధించింది. 2019లో వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానిని 2020కి మార్చారు. అయితే కరోనా కారణంగా వాయిదా తప్పలేదు. 2021లో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా, దానిని రద్దు చేసి టి20 ప్రపంచకప్‌గా మార్చారు. అయితే తమ హక్కులను వదులుకునేందుకు భారత్ ఇష్టపడకపోవడంతో అదే ఏడాది భారత్ (యూఏఈలో) నిర్వహించింది. 2020లో నిర్వహించాల్సిన ఆస్ట్రేలియా దానిని 2022కు మార్చుకోవాల్సి వచ్చింది. గతంలోనూ చాంపియన్స్ ట్రోఫీ సమస్యలతోనే 2009, 2010లో వరుసగా రెండు ప్రపంచకప్‌లు జరిగాయి.
గత రికార్డు
ఇప్పటి వరకు 7 టి20 ప్రపంచకప్‌లు జరగ్గా... వెస్టిండీస్ రెండు సార్లు (2012, 2016), భారత్ (2007), పాక్ (2009), ఇంగ్లండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
ఫార్మాట్
గత వరల్డ్ కప్ తరహాలోనే ఎలాంటి మార్పూ లేదు. తొలి రౌండ్‌లో 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్ తన గ్రూప్‌లోని మిగిలిన 3 టీమ్‌లతో తలపడుతుంది. గ్రూప్‌లో టాప్–2 జట్లు తర్వాతి దశకు అర్హత సాధిస్తాయి.
► గ్రూప్ ‘ఎ’లో మాజీ చాంపియన్ శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ ఉండగా...
► గ్రూప్ ‘బి’లో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే ఉన్నాయి. ఇక్కడ ముందంజలో నిలిచిన నాలుగు టీమ్‌లతో పాటు ర్యాంకింగ్ ద్వారా నేరుగా అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు కలిసి ‘సూపర్ 12’ మ్యాచ్‌లు ఆడతాయి. ‘సూపర్ 12’ మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి మొదలవుతాయి.
► ‘సూపర్ 12’ గ్రూప్–1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్... గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
► ‘సూపర్ 12’లోని రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 9న... రెండో సెమీఫైనల్ నవంబర్ 10న జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 13న నిర్వహిస్తారు.
నేటి మ్యాచ్‌లు
శ్రీలంక vs నమీబియా (ఉదయం గం. 9:30 నుంచి)
నెదర్లాండ్స్ vs యూఏఈ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1,2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment