దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్(384 రేటింగ్ పాయింట్లు), ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(377)లను వెనక్కు నెట్టి అతను అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 386 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా, 2017 ఆగస్ట్ తర్వాత ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ అశ్విన్ 353 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐసీసీ టాప్ 10 ప్లేయర్స్ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, రిషబ్ పంత్(747), రోహిత్ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్(891) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్సన్(886), మార్నస్ లబూషేన్(878) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లోకి దూసుకురాగా, ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండులో, ఆసీస్ సీమర్ జోష్ హేజిల్‌వుడ్ 816 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక జట్ల విభాగంలో 123 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్(121), ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్(107)లు వరుసగా 2, 3, 4 ర్యాంక్‌ల్లో నిలిచాయి.
చదవండి: నెటిజన్లకు దొరికిపోయిన బుమ్రా.. ఇలా ఐతే ఎలా?
Comments
Please login to add a commentAdd a comment