If You Want To Bat I Will Bowl To You Too, When MS Dhoni Impressed Aakash Chopra - Sakshi
Sakshi News home page

#MS Dhoni: నువ్వెందుకు బౌలింగ్‌ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా బౌల్‌ చేస్తాను.. కానీ! అద్దంలో మాత్రమే చూడగలడు!

Published Mon, Jun 19 2023 8:24 PM | Last Updated on Tue, Jun 20 2023 2:36 PM

If You Want To Bat I Will Bowl To You Too When Dhoni impressed Aakash Chopra - Sakshi

‘‘2004లో.. ఇండియా- ఏ జట్టు కెన్యా, జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్‌ ధోని రిజర్వ్‌ కీపర్‌గా ఉండగా.. దినేశ్‌ కార్తిక్‌ తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అయితే, ఓసారి నెట్స్‌లో ధోని.. కార్తిక్‌కు బౌలింగ్‌ చేయడం చూశాను. వెంటనే ధోని దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వెందుకు అతడికి బౌలింగ్‌ చేస్తున్నావు? అతడు నీకు ప్రధాన పోటీదారు అన్న విషయం తెలుసు కదా!

ఒకవేళ అతడు బాగా ప్రాక్టీస్‌ చేసి మెరుగైన ప్రదర్శన ఇస్తే నీకు తుది జట్టులో ఆడే అవకాశం రాదు. కాబట్టి నువ్వు కూడా బ్యాటింగ్‌ లేదంటే కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి కానీ ఇదేంటి? అసలు నువ్వెందుకు అతడికి బౌలింగ్‌ చేస్తున్నావు? అని అడిగాను.

వెంటనే ధోని స్పందిస్తూ.. ‘‘దయచేసి నన్ను ఆపకండి. నాకు బౌలింగ్‌ చేయాలని ఉంది. ఒకవేళ మీకు బ్యాటింగ్‌ చేయాలని ఉంటే చేయండి. కావాలంటే మీకు కూడా నేను బౌలింగ్‌ చేస్తాను’’ అని బదులిచ్చాడు. 

ఈ విషయాన్ని తలచుకున్నపుడల్లా.. ధోని తాను సాధించాలనుకున్నవి ఎలా సాధించగలిగాడో నాకు అర్థమవుతుంది. ధోనికి దినేశ్‌ కార్తికో.. మరెవరో పోటీకానే కాదు. తనకు తానే పోటీ. ఆరోజు తన మాటలతో నాకు కనువిప్పు కలిగించాడు. 

ఎవరైనా సరే ఇతరులతో కాకుండా తమకు తాము పోటీ అని భావిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోనిలా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని పేర్కొన్నాడు.

అంచెలంచెలుగా ఎదిగి
కాగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అయిన ధోని 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మిస్టర్‌ కూల్‌.. 2006లో టీ20లలో అడుగుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు.

ఇక సారథిగా భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. మూడు ఐసీసీ టైటిళ్లు బహుమతిగా ఇచ్చాడు. అదే విధంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ ఐదుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపి.. లీగ్‌ క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. విరాట్‌ కోహ్లి వంటి ఎంతోమంది స్టార్లను తయారు చేసిన ధోని ఎంతో నిరాడంబరంగా ఉంటాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అద్దంలో మాత్రమే చూడగలడు
ఈ నేపథ్యంలో ఒకప్పుడు తనకు పోటీదారు అయిన దినేశ్‌ కార్తిక్‌ విషయంలో ధోని ఆలోచనా ధోరణిని ప్రస్తావిస్తూ ఆకాశ్‌ చోప్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. ‘‘తనకు తానే సాటి. గ్రేట్‌నెస్‌ అనే పదానికి నిర్వచనం ఎంఎస్‌ ధోని. తనకు పోటీ అయిన వ్యక్తిని అతడు కేవలం అద్దంలో మాత్రమే చూడగలడు’’ అంటూ ఆకాశ్‌ ట్విటర్‌లో వీడియో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్‌ చేశాను! నా ప్రవర్తన వల్ల..
2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్‌ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
డబ్ల్యూటీసీ ఫైనల్‌ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement