
Ind Vs Aus 1st T20- Suryakumar Yadav: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ‘స్కై’కి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ధాటికి ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందంటూ ఆకాశానికెత్తాడు.
తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా
కాగా రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సూర్య టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలిసారిగా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ గురువారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదిలోనే జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అదరగొట్టగా... నాలుగో స్థానంలో దిగిన సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
నో బాల్‌తో విజయం ఖరారు
మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 190కి పైగా స్ట్రైక్‌రేటుతో 80 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ ఆఖరి బంతికి షాట్ బాది(నో బాల్ వల్ల.. ఆ సిక్సర్ కౌంట్ కాలేదు) టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
సూర్య వచ్చాడంటే వ్యూహాలు మార్చాల్సిందే
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా ఉంటుంది. నార్మల్ బాల్ వేస్తే కచ్చితంగా షాట్ బాదుతాడు. మిడిలార్డర్‌లో తను బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి ఫీల్డింగ్ మార్పులు చేసుకోవాల్సిందే.
డీప్ ఫైన్ లెగ్.. మిడాన్ దిశగా థర్డ్‌మ్యాన్‌ను పెట్టాలి. సూర్య క్రీజులోకి వచ్చాడంటే తనకు తగ్గట్లు అప్పోజిషన్ టీమ్ అప్పటికప్పుడు తమ వ్యూహాలు మారుస్తూ పోవాలి. ఈ విషయంలో మిగతా బ్యాటర్లతో పోలిస్తే సూర్య మరింత ప్రత్యేకం’’ అని సూర్య ఆట తీరును ప్రశంసించాడు.
వచ్చే ఆరునెలలు కేవలం టీ20లే ఆడించండి
ఇక అంతకు ముందు జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా.. ప్రతి ఆటగాడిని మూడు ఫార్మాట్లు ఆడేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సూర్యుకుమార్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను వారికి ప్రావీణ్యం ఉన్న ఫార్మాట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
టెస్టు, వన్డే, టీ20లలంటూ అటూ ఇటూ తిప్పకుండా.. సూర్యను వచ్చే ఆర్నెళ్ల పాటు పొట్టి ఫార్మాట్లోనే వీలైనంత ఎక్కువగా ఆడించాలని ఆకాశ్ చోప్రా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. టీ20 స్పెషలిస్టుగా తన సేవలను విరివిగా వినియోగించుకుంటూ అతడి నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా తీర్చిదిద్దాలని సలహా ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో తిరిగి బ్యాట్ పట్టగానే సునామీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.
చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా
Captain Suryakumar Yadav's first match as #TeamIndia Captain presented an additional challenge 😉
— BCCI (@BCCI) November 24, 2023
How well does SKY remember his match-winning knock? 🤔
WATCH 🎥#TeamIndia | #INDvAUS pic.twitter.com/X9fLNQEqjw