బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్‌గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.
సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్‌బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
ఘోర ఓటమి
భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్‌ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్‌లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే
అయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.
అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్‌గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.
సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా
కాగా ఆసీస్‌తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్‌బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది.
ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.
చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
Comments
Please login to add a commentAdd a comment