
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిష్టాత్మక గాబా మైదానంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు.. తమ నైపుణ్యాలకు పదునుపెడుతూ పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు హైలైట్‌గా నిలిచింది.
తన ఫుట్‌వర్క్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన కోహ్లి.. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతుల్ని ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డాడు. అయితే, తన అనుభవాన్ని ఉపయోగించి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా.. కోహ్లి యువ ఆటగాళ్లను ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో స్ఫూర్తిని రగిల్చాడు.
ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించిన కోహ్లి
ముఖ్యంగా ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డితో చాలా సేపు ముచ్చటించిన కోహ్లి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో కలిస చేతులు కట్టుకుని వెనుక నిలబడటం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు.. ఆసీస్ గడ్డపై అనుభవం ఉన్న కోహ్లిని కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
గంభీర్ సైతం
ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లను ఉద్దేశించి కాసేపు ప్రసంగించాడు. అడిలైడ్ ఓటమి నుంచి త్వరగా కోలుకుని.. బ్రిస్బేన్ టెస్టుపై దృష్టి పెట్టేలా గౌతీ ఆటగాళ్లను సన్నద్ధం చేశాడు. ఇక రోహిత్ శర్మ సైతం నెట్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటూ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు.

కాగా ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.
రెండో టెస్టులో రోహిత్ విఫలం
ఇక రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే, మిడిలార్డర్‌లో బరిలో దిగిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తొమ్మిది పరుగులే చేశాడు. ఇక అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మొదలుకానుంది.
చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
It is time to look ahead.
Preparations for the Brisbane Test starts right here in Adelaide.#TeamIndia #AUSvIND pic.twitter.com/VfWphBK6pe— BCCI (@BCCI) December 10, 2024